Telangana High Court New CJ Justice Alok Aradhe : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ.. కేంద్రానికి సిఫారసు పంపిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ.. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
జస్టిస్ అలోక్ అరధే ప్రస్థానం : రాయ్‌పూర్‌లో 1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అలోక్ 1988 జులై 12న న్యాయవాదిగా చేరారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2009 డిసెంబరు 29న నియమితులయ్యారు. జమ్ముకశ్మీర్ న్యాయమూర్తిగా 2016 సెప్టెంబరు 16న జస్టిస్ అలోక్ అరాధే బదిలీ అయ్యారు. అక్కడే ఆ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా చేశారు. 2018లో మూడు నెలల పాటు ఆయన జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
Telangana High Court New CJ : 2018 నవంబర్ 17 నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జిగా కొనసాగిన జస్టిస్ అలోక్ అరాధే.. కొంతకాలం కర్ణాటక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాధేను సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.