తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్: 'వ్యక్తిత్వం విశ్లేషించవచ్చు'

పబ్లిక్ డొమైన్​లో ఉన్న సమాచారంపై అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చని హైకోర్టు నొక్కి చెప్పింది. అలా చేయకుండా అడ్డుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కాదా? అని ప్రశ్నించింది. నెట్​ఫ్లిక్స్ చిత్రీకరించిన బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ డాక్యుమెంటరీపై దాఖలు చేసిన అప్పీలుపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేవలం రెండు నిమిషాల ట్రైలర్​తో ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించింది.

By

Published : Oct 2, 2020, 7:24 AM IST

telangana high court latest comment on bad boys billionaires documentary
బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్: 'వ్యక్తిత్వం విశ్లేషించవచ్చు'

నెట్​ఫ్లిక్ చిత్రీకరించిన బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ డాక్యుమెంటరీని చూడకుండానే.. సమాచారం వక్రీకరించారని ఎలా చెబుతున్నారని సత్యం రామలింగరాజును హైకోర్టు ప్రశ్నించింది. డాక్యుమెంటరీని నిలిపివేస్తూ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నెట్​ఫ్లిక్స్ సంస్థ దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ ఆధారంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని.. డాక్యుమెంటరీ చూడకుండానే కింది కోర్టు ఉత్తర్వులు ఎలా జారీ చేసిందని హైకోర్టు ప్రశ్నించింది.

అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు...

పబ్లిక్ డొమైన్​లో ఉన్న సమాచారంపై అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చునని.. అలా చేయకుండా అడ్డుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కాదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సమాచారాన్ని వక్రీకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని రామలింగరాజు తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించగా.. ఒకరి వ్యక్తిత్వం ఎలాంటిదని విశ్లేషించవచ్చునని ధర్మాసనం పేర్కొంది.

పబ్లిక్ డొమైన్​లో ఎవరో రాసిన సమాచారం ఆధారంగా డాక్యుమెంటరీలు తీయడం సరికాదని రామలింగరాజు తరఫు న్యాయవాది అన్నారు. ఇటీవల న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేశారని.. వాటి ఆధారంగా తీస్తే ఎలా అని ప్రశ్నించారు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజి కార్యక్రమానికి హాజరైన రామలింగరాజుకు తనను ఎందుకు ఇంటర్వ్యూ చేశారో తెలియదా? అని కోర్టు ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారాన్ని కోర్టులు ఎలా నియంత్రించగలవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్ పై తదుపరి విచారణ ఈనెల 5కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:సినీ నిర్మాత అశ్వినీదత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు

ABOUT THE AUTHOR

...view details