తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతులపై హైకోర్టు విచారణ.. ఏమి చెప్పిందంటే...

ప్రత్యామ్నాయ బోధన పద్ధతులతో ఈనెల 31 తర్వాత పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పది రోజుల్లో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రభుత్వ బడుల విద్యార్థులకు టీవీల ద్వారా బోధించేలా ముసాయిదా రూపొందించినట్లు విద్యాశాఖ నివేదించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

high court hearing on online classes
ఆన్​లైన్​ తరగతులపై హైకోర్టు విచారణ

By

Published : Jul 14, 2020, 8:08 AM IST

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఆన్​లైన్ తరగతులు నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నెల 31 తర్వాత ప్రత్యామ్నాయ బోధన పద్ధతులతో విద్యాసంవత్సరం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. అయితే అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. బడులు తెరవడం ఆలస్యం అవుతున్నందున ప్రత్యామ్నాయ బోధన పద్ధతులు అనుసరించడం తప్పనిసరిగా మారిందని హైకోర్టుకు వివరించింది.

గ్రామీణ, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యమ్నాయ బోధన పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఈనెల 3న కమిటీ ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ చంద్రన్ తెలిపారు. పాఠశాల విద్యా శాఖ అదనపు, సంయుక్త సంచాలకులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సులతో.. ముసాయిదా పాలసీని సిద్ధం చేసినట్టు నివేదించింది. టీవీల ద్వారా పాఠాలు బోధించాలని కమిటీ సూచించిందని విద్యా శాఖ తెలిపింది. ముసాయిదా పాలసీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని.. పది రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు.

టీవీలు ఉన్నాయి సరే... కరెంట్​ మాటేమిటి

టీవీలు ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. తరగతులు జరిగే సమయంలో విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖను కోరుతామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న ఆన్​లైన్ తరగతుల సంగతేంటని.. వాటిని కొనసాగిస్తారా.. ఆపేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులకు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సంజీవ్ కుమార్ తెలిపారు. ఆన్ లైన్ తరగతులు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ 2 మార్గదర్శకాల్లో స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉండాలని.. అయితే కావచ్చు లేకపోతే లేదు అన్న తీరుగా ఉండ కూడదని పేర్కొంది.

కచ్చితంగా హాజరు కావాలని చెప్పలేదు

మరోవైపు ఆన్ లైన్ బోధన ఏవిధంగా చేస్తున్నారు.. ఐదేళ్ల లోపు విద్యార్థులు తట్టుకునే శక్తి ఎంత మేరకు ఉంటుందని ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్​ను హైకోర్టు ప్రశ్నించింది. ఒకటో తరగతి నుంచి మాత్రమే ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని.. ప్రీ స్కూల్ విద్యార్థులకు చేపట్టడం లేదని ఇస్మా తెలిపింది. ఆన్ లైన్ తరగతులపై తల్లిదండ్రులకు ఆప్షన్ ఇచ్చామని.. కచ్చితంగా హాజరు కావాలని చెప్పలేదని ఇస్మా తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

కొన్ని పాఠశాలలు గంటల తరబడి పాఠాలు నిర్వహిస్తున్నాయని.. కచ్చితంగా హాజరు కావాలని ఫీజులు వసూలు చేస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. సీబీఎస్ఈ తగ్గించిన సిలబస్ కూడా బోధిస్తున్నారా? ఆన్​లైన్ తరగతుల సమయాన్ని బడులు తెరిచాక తగ్గిస్తారా అని హైకోర్టు అడిగింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు సమర్పించాలని ప్రభుత్వం, ఇస్మాను హైకోర్టు.. ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:తెలంగాణలో 36 వేలు దాటిన కరోనా కేసులు, 365కి చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details