రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రపంచమంతా కరోనాపై యుద్ధం చేస్తుంటే ఎస్ఈసీ మాత్రం ఎన్నికలపై దృష్టి పెట్టిందని హైకోర్టు పేర్కొంది. యుద్ధాలు వచ్చినా.. ఆకాశం మీద పడిన ఎన్నికలు జరగాల్సిందేనా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ సంస్థగా రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం బాధాకరమని పేర్కొంది.
పునరాలోచన చేయలేదు
డిసెంబరులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన ఎస్ఈసీ.. ఫిబ్రవరిలో కరోనా తీవ్రత పెరిగిన తర్వాత పరిస్థితిని సమీక్షించ లేదని తప్పుబట్టింది. సిద్దిపేట, అచ్చంపేట వంటి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు చాలా సమయం ఉన్నప్పటికీ.. పునరాలోచన చేయలేదని హైకోర్టు పేర్కొంది. ప్రజల ప్రాణాలు విలువైనవా.. ఎన్నికలా అని ఎస్ఈసీని ఉన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. గతంలో హైదరాబాద్ మేయర్ స్థానాన్ని ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉంచారు కదా అని గుర్తు చేసింది. ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా విపత్తు అత్యవసర పరిస్థితుల్లోనూ ఎన్నికలు వాయిదా వేయకపోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
విధులు చేస్తారా లేదా చస్తారా
హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఎన్నికల విధుల్లో 2,557 పోలీసులు సహా 7 వేల 695 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. స్పందించిన న్యాయస్థానం ఎన్నికల విధులు చేస్తారా లేదా చస్తారా అనే విధిలేని పరిస్థితిని ఉద్యోగులకు కల్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా మంది పోలీసులు, ఇతర ఉద్యోగుల ఇంకా రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోలేదని తెలిపింది. ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల ప్రాణాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రమాదంలోకి నెట్టిందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ హైకోర్టుకు నివేదించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి సొంతంగా వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.
ఆశ్చర్యంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామని తెలపడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు పేర్కొంది. కరోనా నియంత్రణకు ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికలకు మాత్రం సిద్ధంగా ఉన్నామనడమేంటని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం నియంత్రణ చర్యలు చేపట్ట లేదని.. ఎన్నికల ప్రచార రోజులను కూడా కుదించ లేదని హైకోర్టు ఆక్షేపించింది. పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి మిగిలిన ఎన్నిక ప్రక్రియను సజావుగా.. జాగ్రత్తగా నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి పోలింగ్ సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఎస్ఈసీ, ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మే 5కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా కాల్పులు... సెక్యూరిటీ గార్డు మృతి