తెలంగాణ

telangana

ETV Bharat / state

మియాపూర్‌ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు : హైకోర్టు

High Court on Miyapur Lands: మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. భూముల అక్రమాలపై 24 మందిపై అభియోగపత్రాలు దాఖలు చేయగా.. 11 మందిపై హైకోర్టు కొట్టివేసిందని పోలీసులు నివేదించారు. దర్యాప్తు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించిన తర్వాత... సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మియాపూర్‌ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు : హైకోర్టు
మియాపూర్‌ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు : హైకోర్టు

By

Published : Apr 2, 2022, 7:02 AM IST

High Court on Miyapur Lands: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూముల కుంభకోణంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నందున సీబీఐ దర్యాప్తు అవసరంలేదని శుక్రవారం హైకోర్టు తేల్చిచెప్పింది. ఏవైనా అభ్యంతరాలుంటే చట్టప్రకారం తగిన సంస్థలను ఆశ్రయించవచ్చంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లో సర్వే నం.20, 28, 100, 101లోని సుమారు 692 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ట్రినిటీ ఇన్‌ఫ్రా తరఫున పి.ఎస్‌.పార్థసారథి సువిశాల్‌ పవర్‌ జనరేషన్‌ లిమిటెడ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంపై 2017లో సబ్‌రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తులున్నారని, పారదర్శక దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలంటూ భాజపా నేత, ప్రస్తుత ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిల ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి అభియోగ పత్రాలు దాఖలు చేశారన్నారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం మియాపూర్‌ ఏసీపీ ఎస్‌.కృష్ణప్రసాద్‌ కేసు దర్యాప్తుపై స్థాయీ నివేదికను సమర్పించారు. రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో ఆర్‌.శ్రీనివాసరావు, పి.ఎస్‌.పార్థసారథి, పి.వి.ఎస్‌.శర్మలతో సహా 24 మందిపై అభియోగపత్రం దాఖలు చేసినట్లు చెప్పారు. ఇందులో ఏ2 పార్థసారథి, ఏ3 పి.వి.ఎస్‌.శర్మతో సహా పి.ఇంద్రాణిప్రసాద్‌, మహితా ప్రసాద్‌, సునితా ప్రసాద్‌, పి.వెంకటసంజీవ్‌, మహమ్మద్‌ ఇంతియాజ్‌ పాషా, పి.వి.ఆర్‌.మూర్తి, ఆర్‌.సుబ్రమణ్యంలపై 2019, 2021ల్లో హైకోర్టు కేసు కొట్టివేసిందన్నారు.

దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు వేయడానికి ప్రభుత్వం మార్చి 10న జీవో జారీ చేసిందన్నారు. ఇంకా అప్పీలు దాఖలు చేయలేదన్నారు. ఏసీపీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రభుత్వం చర్యలు చేపట్టినందున సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ, పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తుపై తాజా నివేదిక సమర్పించాలని ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేయడం గమనార్హం. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం తగిన సంస్థలను ఆశ్రయించవచ్చునని సూచించింది.

ఇదీ చదవండి: 'ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చలాయించాలని చూడొద్దు'

ABOUT THE AUTHOR

...view details