న్యాయవాది దంపతుల హత్యల కేసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోందని రామగుండం కమిషనరేట్ పోలీసులు హైకోర్టుకు నివేదించారు. హత్యలపై సుమోటోగా స్వీకరించిన వ్యాజ్యంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వామన్ రావు తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పోలీసుల దర్యాప్తుపై రామగుండం అదనపు డీసీపీ... స్థాయి నివేదిక సమర్పించారు. హత్య కోసం నిందితులు ఉపయోగించిన ఆయుధాలను, కాల్చిన దుస్తులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించినట్లు తెలిపారు.
వాంగ్మూలాలు తీసుకున్నాం
ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అన్నారు. మూడు ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ముగ్గురు ప్రయాణికుల సాక్షి వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్లు తెలిపారు. మరో నలుగురి సాధారణ వాంగ్మూలాలు కూడా తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. హత్య సమయంలో అక్కడ ఉన్న మరో 13 మంది ప్రత్యక్ష సాక్షులను వాంగ్మూలు కూడా సేకరించామన్నారు. ప్రత్యక్ష సాక్షులకు భద్రత కల్పించామని.. కొంతమంది తమకు భద్రత అవసరం లేదని స్వచ్ఛదంగా తిరస్కరించారని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల వీడియో దృశ్యాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించామని.. నివేదిక అందేందుకు నాలుగు వారాలు పట్టవచ్చునన్నారు.
మొబైల్ ఫోన్లు గుర్తిస్తున్నాం
నిందితుల్లో కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలను సీఆర్ పీసీ 164 సెక్షన్ ప్రకారం మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు తెలిపారు. బిట్టు శ్రీను, లచ్చయ్య 164 వాంగ్మూల నమోదు కోసం మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేశామని.. అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు. కుంట శ్రీను, చిరంజీవిలను సాక్షులను గుర్తించే పరేడ్ నిర్వహించినట్లు నివేదికలో వివరించారు. ఆరో నిందితుడు వసంతరావు పాత్రపై ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. నిందితులకు మొబైల్ ఫోన్లు సమకూర్చిన కాపు అనిల్‌ను ఏడో నిందితుడిగా చేర్చి ఈనెల 9న అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
సీబీఐకి అప్పగిస్తే సమయం వృథా
తమకు రాష్ట్ర యంత్రాగంపై నమ్మకం లేదని కేసును సీబీఐకి బదిలీ చేయాలని గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావు తరఫు న్యాయవాది కోరారు. ప్రస్తుత దశలో కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కేసును హైకోర్టు పర్యవేక్షిస్తోందని.. ఇప్పటి వరకు దర్యాప్తు సరైన దిశలోనే వెళ్తోందని తెలిపింది. ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తే సమయం వృథానేనని ధర్మాసనం అభిప్రాయపడింది. హత్యపై వామన్ రావు తండ్రికి ఎంత ఆందోళన ఉందో.. హైకోర్టుకూ అంతే ఉందని.. అందుకే సుమోటోగా కేసును విచారణ జరుపుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసిన హైకోర్టు... అప్పటి వరకు జరిగిన దర్యాప్తు స్థాయి నివేదికను సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది.
ఇదీ చూడండి:రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్