వక్ఫ్‌నామా కింద 1955లో భూమి ఇస్తే 2013 వరకు ఏం చేస్తున్నారని వక్ఫ్‌బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. ఆ భూములపై యాజమాన్య హక్కులను పరిశీలించకుండా రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పుబట్టింది. వక్ఫ్‌నామా కింద రాజ్‌భవన్‌ను ఇచ్చినా రిజిస్టర్ చేయించుకుంటారా అని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలోని సర్వే నం.80 భూములకు సంబంధించి 2014 నవంబరు 1న ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ.. ఆ భూములు తమవంటూ సాయిపవన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కె.ప్రవీణ్‌కుమార్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్‌లపై మంగళవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 1955లో మున్నీరున్నీసా బేగం దానం కింద ఇచ్చిన ఈ భూములపై 2006లో ఫైనల్ డిక్రీ వచ్చిందని, హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టులో 2013 నవంబరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఆ వెంటనే వక్ఫ్‌బోర్డు సమావేశమై రిజిస్టర్ చేయించిందని తెలిపారు. 2014 నవంబరు 1న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా పిటిషనర్లకు చెందిన భూములపై హక్కులు కోరుతూ స్వాధీనానికి ప్రయత్నిస్తోందన్నారు.
ఆ భూమి ప్రభుత్వానిదే
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ హఫీజ్‌పేట భూములన్నీ ప్రభుత్వానివేనన్నారు. ప్రభుత్వానికి చెందిన భూములను కొంత మంది ప్రైవేటు వ్యక్తులు భాగపరిష్కారం పేరుతో పంపిణీ చేసుకుంటే చెల్లుబాటు కాదన్నారు. ఇది ప్రభుత్వ భూమిగా పహాణీలో ఉందని తెలిపారు. ముతవల్లీ తరఫు న్యాయవాది ఖురేషి వాదనలు వినిపిస్తూ వక్ఫ్‌నామా ద్వారా ఆస్తులు వచ్చినపుడు చట్టప్రకారం ఎలాంటి నోటీసులు జారీ చేయాల్సిన అవసరంలేదన్నారు.
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. భూమిని ఇచ్చినపుడు మున్నీరున్నీసా బేగం ఆ భూమి ఎలా వచ్చిందో చెప్పలేదంది. అంతేగాకుండా ఈ భూములు హైకోర్టులో పెండింగ్ ఉన్న నిజాం ఆస్తులకు సంబంధించిన సీఎస్ 14 కేసులో భాగమని, అప్పుడు కూడా ఇందులో ప్రతివాదిగా ఉన్న ఆమె తాను 140 ఎకరాలను వక్ఫ్‌బోర్డుకు ఇచ్చినట్లు చెప్పలేదని పేర్కొంది. ఆమె చనిపోయాక పత్రాలు సృష్టించినట్లుందని, కుమ్మక్కైనట్లుందని వ్యాఖ్యానించింది. భూమిని దానంగా ఇచ్చినపుడు పబ్లిక్ నోటీసు ఇచ్చి అభ్యంతరాలు ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించింది. వక్ఫ్‌బోర్డు తరఫున వాదనలు వినిపించడానికి మరికొంత గడువు కావాలని న్యాయవాది కోరగా నిరాకరిస్తూ బుధవారానికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:మంత్రి గంగుల పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు