Hc On IAS And IPS Allotments : ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు వివాదాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎస్ సోమేశ్ కుమార్, ఇంఛార్జి డీజీపీ అంజనీ కుమార్ సహా 13 మంది ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు వివాదాలపై వైఖరి వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న కేంద్రం పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు అదనపు ఎస్పీ అభిషేక్ మహంతి కేటాయింపు వివాదంపై కేంద్రం పిటిషన్ సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం వద్దకు వచ్చింది.
ఒక్కో అధికారికి ఒక్కో న్యాయమేంటి..?
ఏపీకి పోస్టింగ్ ఇవ్వడంలో తెలంగాణ స్పందించడం లేదంటూ అభిషేక్ మహంతి మళ్లీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు క్యాట్ ఇటీవల కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. అభిషేక్ మహంతిని మాత్రమే విధుల్లోకి చేర్చుకోవడం లేదని ఏపీ తరఫు న్యాయవాది తెలిపారు. ఒక్కో అధికారికి ఒక్కో న్యాయమేమిటని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. మిగతా పిటిషన్లు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం వద్ద పెండింగులో ఉన్నాయని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్ రెడ్డి సీజే ధర్మాసనం దృష్టికి తెచారు.