ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తునకు సీబీఐ రెడీ MLAs poaching case transferred to to CBI : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు బాధ్యతను సీబీఐ డైరెక్టర్ దిల్లీ విభాగానికి అప్పగించారు. సిట్ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు సింగిల్ జడ్జి తాజాగా విచారణ జరపాలని సీబీఐని ఇటీవల ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రతిని పరిశీలించిన సీబీఐ డైరెక్టర్.. దర్యాప్తును దిల్లీ విభాగానికి కేటాయించారు. ఈ బృందంలోని ఒక ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్‌స్పెక్టర్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. కోఠిలోని సీబీఐ కార్యాలయం వేదికగా దిల్లీ బృందం ఎమ్మెల్యేలకు ఎర కేసును దర్యాప్తును చేయనుంది. తీర్పుతోపాటు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును ప్రాథమికంగా పరిశీలించిన సీబీఐ అధికారులు.... ఎఫ్‌ఐఆర్ నమోదుకు సిద్ధమయ్యారు.
TS HC hands MLAs Poaching case to CBI : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నుంచి దస్త్రాలు అందగానే... పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. సిట్ నుంచి పత్రాలు ఇవ్వాలని ఇప్పటికే సీఎస్‌కు లేఖ రాసినట్లు.... సీబీఐ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు పత్రాల కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐని ఆదేశించాలని... రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరారు. విచారణ జరుగుతున్నందున సోమవారం వరకూ పత్రాల కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయవద్దని సీబీఐకి ధర్మాసనం తెలిపింది.
MLAs Poaching case update : కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం ఎదుట శుక్రవారం కూడా వాదనలు జరిగాయి. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను విచారించే పరిధి హైకోర్టు ధర్మాసనానికి ఉండదని అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిందితుల హక్కులను కాలరాసేలా విధంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడమే శ్రేయస్కరమని హైకోర్టులో బీజేపీ వాదించింది.
ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తమ పార్టీ కూల్చిందనే తెలంగాణ సర్కారు వాదన సరైంది కాదని బీజేపీ పేర్కొంది. వేరే పార్టీల నుంచి ఒక్కరినీ చేర్చుకోలేదని తెలిపింది. బీఆర్‌ఎస్‌నే ఎనిమిదేళ్లలలో వివిధ పార్టీల నుంచి 37 మందిని చేర్చుకుందని బీజేపీ తరఫు న్యాయవాది వాదించారు. బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్ అంశాలు ఉంటే బయటే చూసుకోవాలని కోర్టులో కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ కోరగా.....సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వర్చువల్ విధానంలో విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
హైకోర్టు విచారణను సీబీఐ దిల్లీ అధికారులు ప్రత్యక్షంగా హాజరై పరిశీలించారు. ధర్మాసనం నుంచి స్పష్టత రాగానే... ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని భావిస్తున్నారు. సీబీఐ కేసు నమోదయితే..ఫిర్యాదు వివరాలను నమోదు చేసేందుకు.. మొదట ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.