రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా (Hich court on gurukulas) ఊపింది. గురుకులాలు తెరవొద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సవరించింది. కొవిడ్ పరిస్థితులు కొనసాగుతున్నందున విద్యాసంస్థలు ఇప్పుడే తెరవొద్దంటూ బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గతంలో విచారణ జరిగింది.
మరోసారి విచారణ...
విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిచ్చిన హైకోర్టు... గురుకులాలు, వసతిగృహాలు తెరవొద్దని ఆగస్టు 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత నెల 1న రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ... గురుకుల విద్యా సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
అనుమతివ్వండి...
ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నందున... గురుకులాలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. గురుకుల విద్యాలయాల్లో అన్ని వసతులు ఉన్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో ఎక్కువగా నిరుపేద విద్యార్థులు ఉన్నారని వివరించారు.
అదుపులోనే కొవిడ్...
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని... ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్లైన్ బోధన కొనసాగించేందుకు అనుమతిస్తూ గతంలోని ఉత్తర్వులను సవరించింది. పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొవిడ్ అదుపులో ఉందని.. నియంత్రణ చర్యలు బాగున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సగం సీట్లు వారికే...
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2021-22 ఏడాది నుంచి సగం సీట్లను స్థానిక నియోజకవర్గాల పరిధిలోని పిల్లలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలలకోసారి జరిగే తల్లిదండ్రులు, విద్యార్థుల సంఘాల (పీటీఏ) సమావేశాలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై పాఠశాల పనితీరును సమీక్షించి, సూచనలు, సలహాలివ్వాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. 50 శాతం సీట్లను స్థానిక నియోజకవర్గాల విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు. ఒకవేళ 50 శాతం సీట్లకు అనుగుణంగా స్థానిక నియోజకవర్గ విద్యార్థులు అందుబాటులో లేకుంటే ప్రవేశపరీక్షలో తదుపరి మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల మేరకు సీట్లు ఇస్తారు.
ఇదీ చూడండి: GURUKULS : గురుకులాల్లో నిలిచిన పోస్టుల భర్తీ
Koppula Eshwar: గురుకులాల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదు