Highcourt Permission for BJP Mahadharna : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీలో అధికార పార్టీ నేతల హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరుద్యోగ మార్చ్ పేరుతో నిరసనలకు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నాయకులను పోలీసులు నిర్బంధించారు. మరోవైపు బీజేపీ శనివారం పేపర్ లీకేజీ వ్యవహారంపై మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు మొదట పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఇందిరాపార్కు వద్ద బీజేపీ శనివారం చేపట్టనున్న మహాధర్నాకు అనుమతి కోసం బీజేపీ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించరాదని బీజేపీకి హైకోర్టు షరతు విధించింది. అదే విధంగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ధర్నాకు హాజరయ్యే నేతల వివరాలు రాత్రి 9 గంటల వరకు పోలీసులకు ఇవ్వాలని సూచించింది.