తెలంగాణ

telangana

ETV Bharat / state

HIGH COURT: రెవెన్యూ ట్రైబ్యునళ్ల పనితీరుపై హైకోర్టు అసంతృప్తి - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు

రెవెన్యూ ట్రైబ్యునళ్ల పనితీరుపై.. హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఇరుపక్షాల వాదనలు విని.. ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పినా పట్టించుకోకుండా.. ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ ట్రైబ్యు నళ్లకు ఛైర్మన్లుగా ఉన్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల తీరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు.

hc
hc

By

Published : Aug 13, 2021, 5:21 AM IST

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన తెలంగాణ భూములు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం కింద జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన రెవెన్యూ ట్రైబ్యునళ్ల పనితీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఇరుపక్షాల వాదనలు విని ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందని... లేదంటే వ్యతిరేక ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. తమ వాదన వినకుండా రెవెన్యూ ట్రైబ్యూనళ్లు ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్​లపై జస్టిస్ పీ.నవీన్ రావు విచారణ చేపట్టారు.

కొత్త చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక ట్రైబ్యునళ్లకు ఎమ్మార్వో, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల వద్ద ఉన్న 16 కేసులు బదిలీ కాగా, రికార్డులు సమర్పించిన పత్రాల ఆధారంగా ఈ కేసుల్లో ఎలాంటి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసులన్నింటిలోనూ ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా రెవెన్యూ ట్రైబ్యునళ్లకు ఛైర్మన్​లుగా ఉన్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల తీరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఇలాంటి పనితీరు అభ్యంతరకరం

రాజ్యాంగపదవుల్లో ఉంటూ ఆలోచారహితంగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా రెవెన్యూ కేసులను పరిష్కరిస్తుండడాన్ని తప్పుబట్టారు. కొన్ని ట్రైబ్యునళ్లలో కేసులను తిరిగి విచారణ ప్రారంభించినప్పటికీ పాత ఉత్తర్వుల్లోని ఒక్క పదం కూడా మార్చకుండా అవే ఉత్తర్వులు ఇస్తున్నారన్నారు. అంతేకాకుండా ఒక కేసులో ఇచ్చిన ఉత్తర్వులను... మరో కేసులోనూ అదేవిధంగా జారీ చేస్తున్నారని, కొన్ని కేసుల్లో సివిల్ కోర్టులను ఆశ్రయించాలని సూచిస్తున్నారన్నారు. ఇలాంటి పనితీరు అభ్యంతరకరమన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించని పక్షంలో ట్రైబ్యునళ్లు జారీ చేసిన ఉత్తర్వులపై పిటిషన్​లు ఈ కోర్టులో దాఖలవుతాయన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ముఖ్యంగా రైతులకు చెందిన సొమ్ముతో పాటు సమయం వృథా అవుతుందన్నారు. ఇది వ్యతిరేక ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

ఇద్దరు కలెక్టర్లకు నోటీసులు

ఇలాంటి వాటిల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా కేసులను పరిష్కరించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు చేపట్టరాదో చెప్పాలంటూ నిజామాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ట్రైబ్యు నళ్లు ఉత్తర్వులు జారీ చేసే ముందు హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోని పక్షంలో కోర్టు ధిక్కరణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇదీ చూడండి:Telangana High Court : 'జీవో 111పై ఎందుకింత ఉదాసీనత'

ABOUT THE AUTHOR

...view details