OMC Case Dismissed Against The IAS Officer Srilaxmi: ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని ఓబులాపురం గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసిన శ్రీలక్ష్మి.. సీబీఐ అభియోగాలకు తగిన ఆధారాలు లేవని వాదించింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వాదనతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. ఈ మేరకు కేసును కొట్టివేసింది.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి అనంతపురం జిల్లాలో గనుల కేటాయింపు జరిగింది. దీనికి సంబంధించిన జీవో, నోటిఫికేషన్ అమలు విషయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో సీబీఐ పదేళ్ల క్రితమే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గాలి జనార్దన్‌రెడ్డికి అనుకూలంగా పనిచేశారని.. దీని వల్ల అక్రమ మైనింగ్‌తో రూ.కోట్లలో నష్టం జరిగిందని అందులో పేర్కొంది. ఈ కేసుపై అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో గతంలో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అనవసరంగా ఇరికించిందని.. తనపై నమోదైన అభియోగాలను కొట్టేయాలని కోరారు. డిశ్చార్జ్ పిటిషన్‌పై అక్టోబర్ 17న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడిస్తూ శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు నిరాకరించింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టకముందే ఓఎంసీ లీజుపై నోటిఫికేషన్ విడుదలైందని పేర్కొన్నారు.