TS HC Accepted Boy's death in dogs attack As sumoto : హైదరాబాద్ నగరంలో ఆదివారం కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు (ప్రదీప్) మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్‌గా పరిగణించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ దీనిపై ఈరోజు విచారణ చేయనుంది. ఈ పిటిషన్‌కు సంబంధించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీని ప్రతివాదులుగా చేసింది.
శునకాల దాడులపై హెచ్‌ఆర్‌సీకి కాంగ్రెస్ ఫిర్యాదు:కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం నిన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం గృహకల్ప కాంప్లెక్స్ ప్రాంగణంలో పార్టీ ప్రతినిధుల బృందం ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కలను అదుపు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలపై కేసులు నమోదు చేయాలని కమిషన్‌ను కోరామని వారు తెలిపారు.