Secunderabad Swapna lok fire accident Updates : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ నెల 16న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. సీఎస్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీ, హైదరాబాద్ కలెక్టర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది.
ఈ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న క్యూనెట్ సంస్థ అక్రమాలు తెరపైకి వచ్చాయి. అధిక కమీషన్లు ఆశజూపి అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకుని గొలుసు కట్టు వ్యాపారం చేస్తున్న క్యూనెట్ సంస్థ అక్రమాలు ఇప్పటికే బట్టబయలైన విషయం తెలిసిందే. తాజా అగ్నిప్రమాద ఘటనతో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూల్ చేస్తున్నట్లు పలువురు బాధితులు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈడీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఈ సంస్థకు చెందిన రూ.137 కోట్లను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.