Heavy Rainsin Telangana Statewide: ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాల్లో పిడుగుపాటుతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చిట్యాల మండలంలోని కైలాపూర్‌లో మిరపనారు నాటుతున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు. కాటారం మండలంలోని దామెరకుంటలో పిడుకుపాటుతో ఓ అన్నదాత మృత్యువాతపడ్డాడు. పొలంలో పనిచేస్తున్న రాజేశ్వర్‌రావుపై అకస్మాత్తుగా పిడుగు పడడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు.
One Person Died in Nizamabad Due to Rains : నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో పలు కాలనీలు నీట మునిగాయి. పులాంగ్‌వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. దానికి ఆనుకుని ఉన్న ఇళ్లలోకి నీరు చేరి బురదమయంగా మారింది. అధికారులు గుపన్‌పల్లి ప్రభుత్వ బడిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలను అక్కడకు తరలించారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో ప్రధాన రహదారిలో ఉన్న.. వాగుపై తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డువంతెన.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. నాలుగు నెలల కిందట వంతెన పనులు ప్రారంభించగా ఇంకా పూర్తికాకపోవడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేసేది ఏమీలేక.. ఇనుప నిచ్చెనను తూములపై పెట్టి ప్రమాదకరంగా ఉన్నా.. వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, రోడ్లు దాటేస్తున్నారు. ఇంత ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదంటూ వాహనదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
"మేము మొత్తం 150 ఇళ్లలో ఉంటాం. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు స్కూల్లోకి తీసుకువస్తారు. తినడానికి తిండి ఆలస్యంగా వస్తోంది. ఓ మూడు రోజులు చూసి మా దారిన మమ్మల్ని వదిలేస్తారు. ఇప్పటికే ఓ వ్యక్తి చనిపోయాడు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నాం."-బాధితుడు
Heavy Rains Sangareddy: సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. గుమ్మడిదల మండలం మంబాపూర్ వద్ద చెరువు అలుగుదాటుతూ.. సుధాకర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు, అధికారులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా సుధాకర్ మృతదేహం లభ్యమైంది. జిల్లాలో చెరువులు, కాలువల్లో జనాలు చేపలు పట్టడానికి తరలివచ్చారు. భారీ చేపలు వలకు చిక్కడంతో.. పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. కామారెడ్డి- మెదక్ జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు(Pocharam Project) నిండుకుండలా మారింది. మెదక్‌లోని ఎల్లమ్మ టెంపుల్ పక్కన ఉన్న పసుపు లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిన్న శంకరంపేట మండలంలోని ధరిపల్లిలో బతుకమ్మ చెరువుకట్టకు గండి పడి.. వృధాగా నీరు పోతోంది. ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ముందున్న పాయ నుంచి వరద నీరు హోరెత్తుతోంది.
Telangana Rains : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ