రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. కోఠిలోని డీపీహెచ్ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన... కరోనా సెకండ్‌వేవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిలువరించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై జరిగిన సమావేశంలోనూ..... తమ అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలిపానని చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి దాదాపు వాక్సినేషన్ పూర్తైందని... ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటే ముందుకురావాలని కోరారు. థర్డ్ వేవ్ వస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఆస్పత్రులు, ఆక్సిజన్ సరఫరా సహా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అప్రమత్తంగా ఉండండి..
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని డీహెచ్ శ్రీనివాస రావు ప్రకటించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు వస్తున్నాయని.. హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు బయటపడ్డాయని డీహెచ్ వెల్లడించారు. ఇప్పటివరకు 1,200 డెంగీ కేసులు వచ్చాయని... మొత్తంగా 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ జ్వరాల కేసులు వచ్చాయని తెలిపారు. ఇకనుంచి వారానికోరోజు డ్రై డేగా పాటించాలని డీహెచ్ పిలుపునిచ్చారు. ఎవరికైనా జ్వరం వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుగా పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్ సూచించారు. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా.. లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ దోమ పగటి వేళ కుడుతుందని.. ఇళ్లలో దోమలు రాకుండా చూసుకోవాలన్నారు.
ఇంటి వద్దకే వ్యాక్సిన్..!