Telangana Gurukulam Exam 2023 : గురుకులనియామక పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. ఒక్కో పేపర్‌కు ఒక్కో జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల్లో టీజీటీ, పీజీటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, జేఎల్, డీఎల్ తదితర బోధన సిబ్బంది నియామకాలకు ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్ పరీక్షలు ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో 9 వేల 210 ఉద్యోగాల కోసం సుమారు 2 లక్షల 66 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. టీజీటీ పరీక్ష దాదాపు లక్ష మంది రాయనున్నారు. అభ్యర్థులు మూడు దఫాలుగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించేలా గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు చేసింది.
సాధారణంగా నియామక, ప్రవేశ పరీక్షల్లో ఒకటి మించి పేపర్లు ఉన్నట్లయితే ఒక అభ్యర్థి ఒక కేంద్రంలోనే అన్నీ రాసేలా ఏర్పాట్లు ఉంటాయి. కానీ గురుకుల నియామక బోర్డు మాత్రం.. పలువురు అభ్యర్థులకు మూడు పేపర్లకు వేర్వేరు కేంద్రాలను కేటాయించింది. కొందరికి ఒకే నగరం, పట్టణంలో మరో కేంద్రం కేటాయించగా.. మరికొందరికి వందల కిలోమీటర్ల దూరంలో కేటాయించారు. కొందరికైతే ఒక్కో పేపర్‌కు ఒక్కో జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని సూచించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
"మా స్నేహితులకు ఒకరోజు హైదరాబాద్, మరోరోజు కరీంనగర్, ఇంకోరోజు వరంగల్‌లో సెంటర్ పడింది. ఇలాంటప్పుడు మాకు సెంటర్ల ఆప్షన్స్ ఎందుకు ఇవ్వాలి. లోకల్ సెంటర్ కాకుండా కేవలం హైదరాబాద్‌లోనే రాయాలి అంటే అసలు పరీక్ష రాయకపోతుండే." - అభ్యర్థి