Telangana Group 4 Notification latest news : తెలంగాణ గ్రూప్-4 పరీక్ష సమీపిస్తుండటంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 1వ తేదీన జరిగే ఈ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను ఇవాళ కమిషన్ విడుదల చేసింది. జులై 1న ఉదయం 10నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో పేపర్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 8వేల 180 పోస్టులకు గత ఏడాది గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేయగా.. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 9.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
వేలి ముద్రలు తప్పనిసరి: గ్రూప్-4 ఉద్యోగుల భర్తీకి జూలై 1న పరీక్ష నిర్వహిస్తుండగా.. రాతపరీక్షలో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్‌పీఎస్సీ తప్పనిసరి చేసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో అభ్యర్థుల ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తరువాతే ఓఎంఆర్ పత్రాల్ని అందజేస్తారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకొని గ్రూప్- 4 రాతపరీక్ష నిర్వహణకు కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో అవసరమైన పరీక్ష కేంద్రాలను గుర్తించిన టీఎస్‌పీఎస్సీ.. పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేస్తోంది.
- గ్రూప్-4కు ట్రై చేస్తున్నారా.. ఇలా చదివితే జాబ్ పక్కా..!
- HighCourt on Group 3 and 4 Exams : గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
అభ్యర్థులు క్షుణంగా తనిఖీలు నిర్వహించిన తరువాతే పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో ఐడీ కార్డు తీసుకెళ్లాలని కమిషన్ పేర్కొంది. గత సంవత్సరం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ చేయగా.. ఆ సమయంలో 100 శాతం అభ్యర్థుల బయోమెట్రిక్‌ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.