Group 1 Prelims Exam 2023 : ఈ నెల 11న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఎల్లుండి జరగనున్న పరీక్షను వాయిదా వేయడానికి ధర్మాసనం నిరాకరించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేదాకా ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఇటీవల పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. దాంతో ఆ సంస్థ విశ్వసనీయతపై సందేహాలున్నాయని ధర్మాసనానికి వారు వివరించారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను యూపీఎస్సీకి అప్పగించాలని పిటిషన్‌లో కోరారు.
TS HC on Group1 Prelims Exam : ఓవైపు ఈ కేసులో ఇంకా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులందరూ ఇంకా బయటపడలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రోజురోజుకూ కొత్త కొత్త నిందితులు తెరపైకి వస్తున్నారని.. అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్ సిద్ధపడిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలపై 5 లక్షల మంది ఆశావహులు ఉన్నారని.. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కమిషన్‌కు వినతి పత్రం సమర్పించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
TSPSC Paper Leak Case Updates : లీకేజీ వ్యవహారంలో కేవలం కమిషన్‌కు చెందిన ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు వాదనలు వినిపించారు. దీనికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడంతో పాటు అసిస్టెంట్ కంట్రోలర్, పరీక్షల రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టుకు వివరించారు. గ్రూప్-1 పరీక్ష కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 5కు వాయిదా వేశారు.