తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వివిధ విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3 లక్షల 42 వేల 954 మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇవాళ 1019 కేంద్రాల్లో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 8:30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు.
నియామక ప్రక్రియలో వివిధ సందర్భాల్లో బయోమెట్రిక్ వివరాల ఆధారంగా అభ్యర్థులను నిర్ధారిస్తారు. జిల్లా కో-ఆర్డినేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు టీఎస్పీఎస్సీ ప్రత్యేకంగా నియమించిన 61 మంది పరీక్షను పర్యవేక్షించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి కమిషన్ ఛైర్మన్, సభ్యులు పర్యవేక్షించారు.
అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేసి.. వెబ్సైట్లో పెట్టనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిది. సుమారు 8 రోజుల్లో ఓఎంఆర్ సమాధాన పత్రాలు స్కాన్ చేసి.. ఆ తర్వాత ప్రాథమిక సమాధానాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి.. సహకరించిన వివిధ విభాగాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా జోన్, రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ డిసెంబరులో నిర్వహించే అవకాశం ఉంది.