తెలంగాణ తొలిగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. 503 పోస్టుల భర్తీకి జరగనున్న ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ యంత్రాంగం సిద్ధమైంది. నిఘా నీడన భారీ బందోబస్తు మధ్య పరీక్షకు ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 నుంచి అనుమతిస్తామని, 10.15 తరువాత అనుమతి ఉండదని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రశ్నపత్రం తెరవగానే అందులో 150 ప్రశ్నలూ ముద్రించారో లేదో చూసుకోవాలంది.
ముద్రణ పొరపాట్లుంటే మరొకటి అడిగి తీసుకోవాలని సూచించింది. ప్రశ్నపత్రంపై జవాబులను మార్కు చేయవద్దని, ఓఎంఆర్ షీట్లో సూచించిన చోట కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తామని వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల డిజిటల్ ఇమేజ్ స్కానింగ్ అనంతరం డిజిటల్ ఓఎంఆర్ కాపీలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు పరీక్ష సమయంలో బయోమెట్రిక్ నమోదు చేయాలంది. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించింది.
ఆరంకెల సిరీస్ ప్రశ్నపత్రాలు..ప్రిలిమినరీ(ప్రాథమిక) పరీక్షకు ఎ, బి, సి, డి సిరీస్‌ల స్థానంలో ఆరంకెల బహుళ సిరీస్‌ల ప్రశ్నపత్రాలు రానున్నాయి. అభ్యర్థులు ఆరంకెల సిరీస్‌తో కూడిన ప్రశ్నపత్రం కోడ్‌ను ఓఎంఆర్ షీట్‌లో నమోదు చేసి, ఆ మేరకు వృత్తాల్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో బబ్లింగ్ చేయాలని కమిషన్ తెలిపింది. ప్రశ్నపత్రం బుక్‌లెట్ సిరీస్ నంబరు ఓఎంఆర్‌లో రాసి, వృత్తాల్ని సరిగా బబ్లింగ్ చేయకున్నా, వృత్తాల్ని సరిగా నింపి బుక్‌లెట్ సిరీస్ నంబరు రాయకున్నా..ఒక్క అంకెను తప్పించినా ఆ ఓఎంఆర్‌ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించింది. ఓఎంఆర్ షీట్‌లో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంతో పాటు అభ్యర్థి పేరు ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్‌లో రాయాల్సి ఉంటుంది. డబుల్ బబ్లింగ్, చాక్‌పౌడర్, రబ్బరు వాడి జవాబును చెరిపిన, తప్పుగా వివరాలు పేర్కొన్న జవాబు పత్రాలనూ పరిశీలనలోకి తీసుకోబోమని వెల్లడించింది.
39వేల మంది దూరం...!పరీక్షకు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, శనివారం అర్ధరాత్రి వరకు 3.41 లక్షల మంది హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. చివరి రోజున సుమారు 20వేల మంది హాల్‌టికెట్లు తీసుకున్నారు.
మూడు జిల్లాల్లో ఎక్కువ...గ్రూప్-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 349 కేంద్రాలు ఉంటే.. దాదాపు 1.55 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. మేడ్చల్ జిల్లాలో 51,931 మంది, ములుగు జిల్లా నుంచి 1,933 మంది హాజరు కానున్నారు.