తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష భారీ భద్రత నడుమ కొనసాగింది. 503 పోస్టుల భర్తీకి జరగనున్న ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింది. నిఘా నీడన భారీ బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహించింది. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 నుంచి లోపలకి అనుమతించారు. 10.15 తరువాత అన్ని గేట్లు బంద్ చేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. ఒంటిగంటకు పరీక్ష ముగిసింది.
పలుచోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అనుమతి నిరాకరించారు. ఆలస్యమవడంతో అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపారు. హనుమకొండలో పరీక్షా కేంద్రానికి పసిబిడ్డతో వచ్చిన మహిళా అభ్యర్థి ఆలస్యం కావడంతో వెనుతిరిగింది. సిద్దిపేటలో 20 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుండగా.. వివిధ కేంద్రాల్లో 11 మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. వారందరిని అధికారులు వెనక్కి పంపారు.
39వేల మంది దూరం...!పరీక్షకు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, శనివారం అర్ధరాత్రి వరకు 3.41 లక్షల మంది హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. చివరి రోజున సుమారు 20 వేల మంది హాల్‌టికెట్లు తీసుకున్నారు.