Pattadaru pass books for non agricultural lands: వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. ధరణి పోర్టల్ ద్వారా లావాదేవీలను తీసుకొచ్చే విషయమై చర్చించటంతో పాటు కొంతమేర కసరత్తు జరిగింది. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ రంగులో, వ్యవసాయేతర ఆస్తులకు ముదురు ఎరుపు రంగు పాసు పుస్తకాలు ఇవ్వాలని అప్పట్లో ప్రతిపాదించారు.
అయితే న్యాయస్థానం ఆదేశాలతో ధరణి లావాదేవీలను కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పరిమితం చేశారు. తాజాగా వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాసుపుస్తకాలు ఇవ్వాలనే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం క్రమబద్ధీకరణ సమస్యలు, గ్రామకంఠం అంశాలు, ఇతరత్రా అన్నింటినీ పరిష్కరించి పట్టాలు పంపిణీ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. అర్హులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి కూడా పట్టాదారు పాసుపుస్తకం ఉంటే బాగుంటుందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. గతంలో వ్యవసాయేతర ఆస్తులకు ముదురు ఎరుపు రంగులో పాసుపుస్తకాలు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని అధికారులు గుర్తుచేశారు. ఈ విషయమై మరింత కసరత్తు చేయటంతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సమావేశంలో ఈ అంశంపై మరోమారు చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుంది.