Floods loss report in TS: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని జిల్లాల్లోని ప్రాంతాలు పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గోదావరి పరివాహాక ప్రాంతాల ప్రజలు వరదల్లో అధికంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాథమిక నివేదికను రూపొందించి కేంద్రానికి అందించింది. రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల రూ.1400 కోట్లు నష్టం జరిగినట్లు నివేదికలో వెల్లడించింది. తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టంపై అధికారులతో చర్చించారు.
వర్షాలు, వరదల వల్ల కాజ్‌వేలు, రోడ్లు కొట్టుకుపోవడంతో రోడ్లు భవనాలశాఖకు రూ.498 కోట్లు నష్టం రాగా.. నీటి పారుదలశాఖకు రూ.33 కోట్లు నష్టం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పొందుపరిచింది. వరదల వల్ల పంచాయితీ రాజ్ శాఖలో రూ.449 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపింది. అలాగే వరదలతో విద్యుత్‌శాఖకు రూ.7 కోట్లు.. పురపాలకశాఖలో రూ.379 కోట్లు, ప్రజలను తరలించడానికి రూ.25 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది.