వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు వేగంగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలకు రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఏకంగా కొట్టుకుపోయాయి. కల్వర్టులు, చిన్నపాటి వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు రూ.50 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. తక్షణం పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో స్పష్టంచేశారు.
దెబ్బతిన్న రహదారులను గుర్తించడం మొదలు టెండర్లు పిలవడం, పనుల ప్రారంభం వరకు సీఎం లక్ష్యాలను నిర్దేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద కసరత్తు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేశారు. 4,235 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. రహదారుల మరమ్మతు కోసం రూ.1,878 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే పది జిల్లాల్లో టెండర్లు ఆహ్వానించారు. డిసెంబరు పదో తేదీలోగా అన్ని జిల్లాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మొత్తం మరమ్మతులను పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.