Last date for the scheme of one lakh scheme : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో... ఆయా వర్గాలను అకట్టుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద లబ్ధిపొందించేందుకు కుల, చేతి వృత్తుల కుటుంబాలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఏ గ్రామంలో చూసినా హడావుడి కనిపిస్తోంది. మండల, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మీసేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు.
మీసేవ కేంద్రాల్లో రద్దీ.. ఈ నెల 20వ తేదీ తుది గడువు సమీపించడంతో.. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రద్దీ అధికమై కంప్యూటర్ సర్వర్ మొరయిస్తుండటంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఈ నేపథ్యంలోఅన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. దరఖాస్తుదారు ఎవర్నీ ప్రత్యక్షంగా కలువాల్సిన అవసరం లేదు. రెండు సంవత్సరాల క్రితం ఆదాయ ధృవీకరణ పత్రాలు పనిచేస్తాయి.
నిర్ణయాధికారం వారికే.. పనిముట్లు, సరుకుల కొనుగోళ్లపై కులవృత్తుల్లోని చేతివృత్తుదారులకే నిర్ణయాధికారం... దళారులను నమ్మవద్దంటూ ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ చెబుతున్నా కూడా అర లక్ష రూపాయలు ఆదాయం దాటిన వెనుకబడిన వర్గాల 1 లక్ష సహాయం కోసం దరఖాస్తులు వెల్లువెత్తుండటంతో ఈ పథకం కింద సాయం ఇప్పిస్తామంటూ దళారులు బయలుదేరారు.
నిరంతర ప్రక్రియ.. సాధారణంగా ఒక్కో జిల్లాలో రోజు వెయ్యి పైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇవాళ్టి వరకు 3.5 లక్షల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ దృష్ట్యా మొదటగా అర్హత కలిగిన లబ్ధిదారుల్లో అత్యంత పేద కుటుంబాలకు అందజేస్తూ ప్రతీ నెల 5వ తేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఇంఛార్జి మంత్రులు ధృవీకరించిన జాబితాలో లబ్ధిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సాయం అందజేస్తారు.
ముఖ్యమంత్రి చేతులమీదుగా.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాలలో లాంఛనంగాప్రారంభించారు. ఈ నెల 9న బీసీల్లోని కులవృత్తి, చేతి వృత్తి కులాల వారికి ఆర్థిక సాయం' పథకాన్ని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా తోటపల్లి మండలం వెలమపల్లికి చెందిన కుందారపు మురళి ( కుమ్మరి వృత్తి), భీమారంకు చెందిన మామిడి సత్యనారాయణ (నాయి బ్రాహ్మణ వృత్తి)కు ముఖ్యమంత్రి లక్ష రుపాయల చెక్కు తన చేతుల మీదుగా అందించారు.
అంతా ఆన్లైన్లోనే.. హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ నెల 6 నుండి 20 తేదీ వరకూ https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా అప్లికేషన్ ఫారంను రూపొందించారు. దరఖాస్తులను జిల్లా యంత్రాంగంతో పరిశీలన జరిపి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
కులాల జాబితా విడుదల.. బీసీలకు లక్ష రూపాయలు పథకం కింద 1. నాయూ బ్రాహ్మణులు, 2. రజక, 3. సరగ లేదా ఉప్పర, 4. కుమ్మరి లేదా శాలివాహన, 5. గోల్డ్‌స్మిత్, 6. కంసాలి, 7. వడ్రంగి, శిల్పులు, 8. వడ్డెర, 9. కమ్మరి, 10. కంచరి, 11. మేదర, 12. కృష్ణ బలిజ పూస, 13. మేర (టైలర్స్), 14. అరె కటిక, 15. ఎంబీసీ కులాలు ఉన్నాయి. 36 కులాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది. వీరిలో దాసరి, దొమ్మర, జంగం, పాములు, పర్తి, పెద్దమ్మవండ్లు, వీరముష్టి, గుడల, కంజర, రెడ్డిక, మందుల, బుక్క అయ్యవారు, రాజన్న వంటి కులాలు ఉన్నాయి. అయితే... అసలు పూర్తి ఎంబీసీ జాబితాపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఏ కులాలు పూర్తి ఎంబీసీ జాబితాలకు వస్తాయో తెలియజేయాలి ఇప్పటికే ఎంబీసీ సంఘాలు ప్రభుత్వానికి కోరాయి.
ఇతర కులస్తుల అసంతృప్తి.. ఈ నేపథ్యంలో దరఖాస్తులో బీసీ-సీ, బీసీ-ఈ కులాలు కనిపించడం లేదు. బీసీ-సీ ఉప కులాల్లో షెడ్యూల్డ్ కులాల నుంచి క్రిస్టియానిటీ మతంలోకి మారినవారు. ఇక బీసీ-ఈలో ముస్లిం, మైనారిటీ కులాలు ఉంటారు. బీసీ-బీలో ఉన్న దుదేకుల కులం ఉంది. కానీ, వీరిని ఇందులో చేర్చకపోవడం ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కల్లు గీత కార్మికులైన గౌడ, పద్మశాలి, ముదిరాజ్, గొల్ల, కురుమ, మున్నూరుకాపు, బలిజ వంటి కులాల ప్రస్తావన లేదు. వీరంతా తమ కుల వృత్తులు చేసుకుని జీవించే కుటుంబాలే. మీ సేవా కార్యాలయానికి వెళితే జాబితాలో మీ కులం లేదని వెనక్కి పంపుతుండటం నిరసన వ్యక్తమవుతోంది.
పైరవీకారులను పట్టించుకోవద్దు.. బీసీలకు లక్ష సాయం అనేది నిరంతర ప్రక్రియ. ప్రతీ నెల 15వ తారీఖున పథకం గ్రౌండింగ్ ఉంటుంది. సంపూర్ణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి తప్ప.. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఎవరినీ కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు. పైరవీకారులను పట్టించుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. నెల రోజుల లోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫోటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఇవీ చదవండి: