యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కసరత్తు షురూ Govt On Paddy Procurement: యాసంగి వడ్లను కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అన్నదాతల నుంచి ఆఖరి గింజ వరకు మద్దతు ధరకే కొంటామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు అనగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ప్రతి జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులందరూ కేంద్రాల ఏర్పాటు పనుల్లో నిమగ్నమవ్వాలని సూచించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి... ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్దేశించారు. కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజాప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద నీడ సౌకర్యం, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎస్... గన్నీ బ్యాగుల సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. వడ్ల రవాణాకు వాహనాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
టోకెన్ పద్ధతిలో: వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. త్వరలో కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించాలన్న మంత్రి... టోకెన్ పద్ధతి ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రైస్ మిల్లర్లు... రైతులకు సంపూర్ణంగా సహకరించాలని మంత్రి సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తిసినా...సీఎం కేసీఆర్ 3 వేల కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు దిగినా.... మోదీ సర్కార్ మనసు కరగలేదని విమర్శించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పునరుద్ఘాటించారు.
పాలాభిషేకం: యాసంగి వడ్లను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తుందన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. భువనగిరి ప్రిన్స్ కార్నర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్.. చిత్రపటానికి తెరాస శ్రేణులు వడ్లతో అభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ చైతన్యపురి చౌరస్తాలో గులాబీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కేసీఆర్.. చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుండగా....తెరాస భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భాజపా పోరాటంతోనే రాష్ట్రప్రభుత్వం దిగొచ్చిందన్న కమలం నేతల నినాదాలపై... గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: