Vacancies in Telangana Fire Department : రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న అగ్నిప్రమాదాలు భయపెడుతున్నా.. భరోసా ఇవ్వాల్సిన అగ్నిమాపక విపత్తు నివారణ శాఖ సమస్యలతో సతమతమవుతోంది. మంటలార్పేందుకు ఫైర్ ఇంజిన్లే కాదు.. వాటిని నడపాల్సిన డ్రైవర్లు కూడా తగినంతమంది లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉన్న అరకొర సదుపాయాలతోనే నెట్టుకొస్తున్నారు. ఒకేసారి రెండు, మూడు ప్రమాదాలు జరిగితే దేవుడి మీద భారం వేయడం మినహా గత్యంతరం లేదంటే అతిశయోక్తికాదు. సికింద్రాబాద్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆ శాఖ సామర్థ్యం మరోమారు చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు వేసవికాలంలోనే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగేవి. కానీ, ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక శాఖ లెక్కల ప్రకారం 2021లో రాష్ట్రంలో 7,327 ప్రమాదాలు జరిగాయి. 2022కు సంబంధించి లెక్కలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రమాదాలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలు.. ఒకవేళ జరిగితే ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ఆ శాఖలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. కానీ, అవి ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. ఉదాహరణకు సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో గత ఏడాది సెప్టెంబరులో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మరణించారు. పైన లాడ్జి ఏర్పాటు చేసి సెల్లార్‌లో విద్యుత్తు ద్విచక్రవాహనాల దుకాణం పెట్టారు. వాటి ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగినట్లు ఆ ప్రమాదంతో తేటతెల్లమెంది.