ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ఎలాంటి రుసుములను పెంచరాదని ప్రభుత్వం ఆదేశించింది. జులై 1 నుంచి ఆన్‌లైన్ బోధన ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యా శాఖ తాజాగా జీవో 75 జారీ చేసింది. బోధన రుసుము మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, అంతర్జాతీయ పాఠశాలలకూ జీవో వర్తిస్తుందని విద్యా శాఖ పేర్కొంది. జీవో ఉల్లంఘిస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని.. ఇతర బోర్డులకు ఎన్ఓసీ ఉపసంహరిస్తామని జీవోలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ జీవో అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
సెట్ పరీక్షల్లో మార్పుల్లేవ్..
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సెట్ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జులైలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్లైన్లోనే బోధించాలన్నారు. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. దూరదర్శన్ యూట్యూబ్ ఛానెల్‌లోనూ పాఠాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్ ఫీజులు నెలవారీగా వసూలు చేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో 50శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.