తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ సోనా.. రాష్ట్రానికే బ్రాండ్​ ఇమేజ్​ కల్పించనుంది' - తెలంగాణ సోనా - ఆర్‌ఎన్‌ఆర్‌ 15048

తెలంగాణ సోనా - ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకానికి బ్రాండ్ కల్పించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సెప్టెంబరు కల్లా ఈ ఒప్పందం వల్ల ఫలితాలు కనబడాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్​రెడ్డి అన్నారు. ఈ బియ్యం రకం తెలంగాణకే బ్రాండ్​ ఇమేజ్​ కల్పించనుందని తెలిపారు.

telangana-govt-focus-to-sona-rice-branding-in-global-level
'తెలంగాణ సోనా.. రాష్ట్రానికే బ్రాండ్​ ఇమేజ్​ కల్పించనుంది'

By

Published : Aug 14, 2020, 9:15 PM IST

తెలంగాణ సోనా బియ్యం రకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకే బ్రాండ్ ఇమేజ్​ కల్పించనుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్​రెడ్డి అన్నారు. తెలంగాణ సోనా - ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకానికి బ్రాండ్ కల్పించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఆనంద్‌సింగ్, ఐఎస్‌బీ ప్రతినిధులు పాల్గొన్నారు. గత కొంత కాలంగా ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని జనార్దన్​రెడ్డి​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతల్లో మిగులు రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని చెప్పారు. రైతుల సౌకర్యార్థం... ఇప్పుడు ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సెప్టెంబరు కల్లా ఈ ఒప‌్పందం వల్ల ఫలితాలు కనబడాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది తెలంగాణ సోనా వరి రకం పంట సాగు, విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే రైతాంగం ఈ సారి వ్యవసాయ శాఖ సూచించిన విధంగా నియంత్రిత పంట సాగు చేపట్టిందని చెప్పుకొచ్చారు.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఇటువంటి రకం విత్తనం రూపొందించినందుకు వర్సిటీ ఉపకులపతి, శాస్త్రవేత్తలను జనార్దన్​‌రెడ్డి అభినందించారు. ప్రభుత్వ సహకారం... అందరి సమష్టి కృషితోనే పీజేటీఎస్‌ఏయూ దేశంలోని వ్యవసాయ వర్సిటీల్లో 3వ స్థానంలో నిలిచిందని... దక్షిణ భారతంలో తొలిస్థానంలో నిలిచిందని ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అన్నారు. రైతాంగం నేడు ప్రధానంగా రిస్క్​, పెట్టుబడి వ్యయం పెరగడం, సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం అనే మూడు సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపారు. తెలంగాణ సోనాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి డిమాండ్ వస్తుందని... వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు అవసరమని వీసీ అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి: తెలంగాణ సోనా వరి రకానికి బ్రాండింగ్‌.. ఐఎస్‌బీతో సర్కార్​

ABOUT THE AUTHOR

...view details