Fish Sector Production: స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యసంపద గణనీయంగాపెరిగింది. జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేపల ఉత్పత్తి 3.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ రంగాన్ని మరింత బలోపేతంపై దృష్టిసారించిన సర్కారు... హైదరాబాద్‌లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఐకాస నేతలతో సమావేశం నిర్వహించింది. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులపై న్యాయపరమైన ఇబ్బందులు, మత్స్యకారుల మధ్య సమన్వయంపై చర్చించారు. నీటి వనరుల సద్వినియోగంపై సమాలోచనలు చేశారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల బలోపేతంతో పాటు మత్స్యరంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారని ఐకాస నాయకులు తెలిపారు.
మత్య్సశాఖకు బదిలీ...
పంచాయతీ పరిధిలో ఉన్న 100 ఎకరాల లోపు ఆయకట్టు చెరువులను ప్రభుత్వం మత్స్యశాఖకు బదిలీ చేసింది. లీజు నిబంధనలు నిర్దేశించింది. నీటివనరుల్లో 1 హెక్టారుకు 1,333 నుంచి 2,132, సొసైటీలో పరిధిలో లేని చెరువుల్లో హెక్టారుకు 1,943 నుంచి 3,108గా ప్రతిపాదించింది. 6 నుంచి 9 మాసాలపాటు నీరు నిల్వ ఉంటే స్వల్పకాలిక నీటి వనరుల్లో... సొసైటీ పరిధిలో నీటి వనరులకు హెక్టారుకు 596 నుంచి 953, సొసైటీ పరిధిలో లేని చెరువుకు హెక్టారుకు 870 నుంచి 1392 రూపాయలు ప్రతిపాదించింది. ఆ లీజుధరలు పున: పరిశీలించాలని కోరగా.... మంత్రి సానుకూలంగా స్పందించారని మత్స్యసంఘాల నాయకులు తెలిపారు.