తెలంగాణ

telangana

ETV Bharat / state

Govt on Loans: కేంద్ర ఆర్థికశాఖకు వివరణ.. నివేదికపై ప్రభుత్వం కసరత్తు

Govt Exercise for Loans: రుణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నివేదించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆర్థికశాఖ సమీక్షలో చెప్పిన అంశాల ఆధారంగా రాష్ట్ర వాదనలను పంపనున్నారు. కొత్త రాష్ట్రం, ప్రజల ఆకాంక్షలు, ప్రత్యేక పరిస్థితులు సహా ఆర్థిక సామర్థ్యం లాంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

By

Published : May 12, 2022, 5:00 AM IST

Updated : May 12, 2022, 5:23 AM IST

Govt Exercise for Loans
రుణాలకు అనుమతికి కసరత్తు

Govt Exercise for Loans: అప్పులకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ లేవనెత్తిన అభ్యంతరాలకు తగిన విధంగా వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు తీసుకొని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలు, అవసరాలు, ప్రస్తుత స్థితిని కేంద్రానికి ప్రత్యేకంగా నివేదించనున్నారు. రాష్ట్ర అప్పులకు సంబంధించిన అన్ని అంశాలను రెండు రోజుల క్రితం జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు వివరించారు. వాటన్నింటినీ తమకు లిఖిత పూర్వకంగా పంపాలని, పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి తెలిపారు. దీంతో కేంద్రానికి పంపాల్సిన నివేదికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దృశ్య మాధ్యమ సమీక్షలో ప్రస్తావించిన అంశాలతో పాటు రాష్ట్ర వాదన బలంగా ఉండేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై దృష్టి సారించారు.

కేంద్ర ఆర్థికశాఖకు వివరణ.. నివేదికపై ప్రభుత్వం కసరత్తు

ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డిలతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. కేంద్రానికి నివేదించాల్సిన అంశాలపై చర్చించారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, వాటిని తీర్చేందుకు అవసరమయ్యే నిధులు, రాష్ట్ర అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు, తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రత్యేకించి కేంద్రం అభ్యంతరం చెబుతున్న బడ్జెట్ వెలుపలి రుణాలు, వాటితో చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు. అప్పుల ద్వారా తీసుకున్న మొత్తాన్ని మూలధన వ్యయంగానే ఉపయోగిస్తున్నామని, ఆయా ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని నివేదికలో పేర్కొననున్నారు. ప్రాజెక్టుల పూర్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వాటి అవసరాన్ని వివరించనున్నారు. రుణాల ఆవశ్యకతను వివరిస్తూనే రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం తదితర అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేంద్రానికి నివేదిక పంపనున్నారు.

Last Updated : May 12, 2022, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details