తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2020, 9:37 PM IST

ETV Bharat / state

హైదరాబాద్​ రోడ్ల రూపురేఖలను మార్చేస్తోన్న ప్రభుత్వం

రహదారులు ప్రగతికి చిహ్నాలు. మంచి ప్రమాణాలు, నాణ్యతతో కూడిన రహదారులుంటే... ఏ నగరమైనా వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. మరీ ముఖ్యంగా కోట్ల మందికి నివాసమైన హైదరాబాద్‌ వంటి... మహానగరాల్లో నాణ్యమైన రోడ్లు ఎంతో ముఖ్యం. రోడ్ల స్థితిగతులు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే... ఏళ్లుగా నరక ప్రాయంగా మారిన భాగ్యనగర రోడ్ల రూపురేఖల్ని సమూలంగా మార్చేందుకు... ప్రభుత్వం భారీ ప్రయత్నం చేస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరికొత్త ప్రణాళికను అమలు చేస్తోంది. నగరవ్యాప్తంగా ప్లైఓవర్లు, అండర్ పాస్​లు, లింక్ రోడ్లు, భారీ ఎత్తున నిర్మిస్తోంది.

hyderabad roads
hyderabad roads

హైదరాబాద్​ రోడ్ల రూపురేఖలను మార్చేస్తోన్న ప్రభుత్వం

హైదరాబాద్‌ రోడ్లపై నిత్యం లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. ఇక్కడి కూడళ్లల్లోని ట్రాఫిక్‌ను దాటుకుని వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. వాహనాల సరాసరి వేగం కూడా చాలా తక్కువ. వీటికి తోడు... రోడ్లు చాలా వరకు పాడైపోయాయి. అందుకు వాహనాల రద్దీ ప్రధాన కారణం కాగా... రోడ్ల నిర్వహణ, మరమ్మతులు సరిగా లేకపోవడం మరో కారణం. హైదరాబాద్‌ రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుందని ప్రజలు ఏళ్లుగా వాపోతున్నారు. వీటికి తోడు... పెద్ద ఎత్తున ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం... నగర రోడ్ల పరిస్థితి పరోక్షంగా పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని గుర్తించింది. అందుకే... భాగ్యనగర రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో నిర్మించాలని తలపెట్టిన ప్రభుత్వం... దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి, అమలు చేస్తోంది.

ఐదు దశల్లో

హైదరాబాద్‌ రోడ్లను సమూలంగా మార్చేందుకు... వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక - ఎస్​ఆర్​డీపీ, నమూనా రహదారి కారిడార్లు, రహదారుల అనుసంధానం-హెచ్​ఆర్​డీసీఎల్​, సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం - సీఆర్​ఎంఆర్​, హైవే ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ- ఎంటీఎంసీ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు- ఓఆర్​ఆర్​లను చేపట్టింది. ఈ ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేస్తోంది. గత ఆరేళ్లల్లో హైదరాబాద్‌ అభివృద్ధికి 67 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వం... దాదాపు 80 శాతం నిధులను ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, నూతన లింక్‌ రోడ్లు, రోడ్ల మరమ్మతులకే వినియోగించింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరిగే ప్రాంతాలను మొదటి దశలో ఎంచుకుంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, శంషాబాద్ విమానాశ్రయం, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాలపై దృష్టి సారించింది. తక్కువ భూసేకరణ, అవసరమైన కారిడార్లకు ప్రాధాన్యతనిస్తూ ఐదు దశల్లో రోడ్ల నిర్మాణ, ట్రాఫిక్‌ తగ్గింపు పనులు చేపట్టింది.

రద్దీ తగ్గడంతో పాటు పర్యాటకంగా

ఈ ప్రాజెక్టుల్లో ప్రధానమైంది.... వ్యూహాత్మక రహాదారి అభివృద్ధి కార్యక్రమం ఎస్​ఆర్​డీపీ. నగరంలోకి ప్రవేశించే ప్రాంతాలు, వాహన రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి... సిగ్నల్ లేని ప్రయాణం అనే విధానంతో ఎస్​ఆర్​డీపీ కింద నిర్మాణాలు చేపట్టారు. ఇందుకోసం... రూ.8,410 కోట్లు ఖర్చు చేయగా... నగరంలో పెద్ద ఎత్తున కొత్త రోడ్లు, ఫ్లె ఓవర్లు, గ్రేడ్ సపరేటర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ రోడ్డు బ్రిడ్జిలు, అండర్ పాస్‌లను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ పర్యాటకానికి సరికొత్త చిరునామాగా మారిన దుర్గం చెరువు తీగల వంతెనను ఈ ప్రాజెక్టులో భాగంగానే నిర్మించారు. ఈ వంతెనతో ఆయా ప్రాంతాల్లో రద్దీ చాలా వరకు తగ్గుముఖం పట్టడమే కాకుండా పర్యాటకంగా ఆకట్టుకుంటోంది.

లింక్​ రోడ్లతో తగ్గిన దూరం

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చిన మరో ప్రాజెక్టు... లింక్‌ రోడ్ల నిర్మాణం. పూర్తి ప్రణాళికాబద్ధంగా..... ప్రధాన రహదారులను అనుసంధానం చేసేందుకు సరికొత్త మార్గాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే... నగరంలో 126కిలో మీటర్ల మేర 137 లింక్ రోడ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే...47 కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి రాగా... మిగతా రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ లింక్‌ రోడ్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే... ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులకు దగ్గరి దారులు అందుబాటులోకి వస్తాయి. ఇవి ఉండేందుకు 100 మీటర్లే ఉంటున్నా... వీటి వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రధాన కూడళ్లలో రద్దీ, ట్రాఫిక్‌ సమస్యలు తీరతాయి. వీటితో పాటు... ఇంధన వినియోగం, వాయు కాలుష్య తగ్గటం, వాహనదారులు త్వరగా గమ్య స్థానాలకు చేరుకునే అవకాశముంది.

ప్రమాణాల ప్రకారం రోడ్లు

నగరంలోని రోడ్ల నిర్వహణ చాలా దారుణంగా ఉంటుందనే విమర్శల నేపథ్యంలో వీటిని పరిష్కరించేందుకు సీఆర్​ఎంపీ ప్రాజెక్టు కింద పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో నగరంలోని 709 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించగా... ఐదేళ్ల నిర్వహణకు రూ.1,839 కోట్లను కేటాయించారు. రోడ్ల నిర్వాహణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో చెత్త, గుంతలు, వర్షపు నీరు నిలవడం వంటి సమస్యలను నిర్వహణ సంస్థే పరిష్కరించనుంది. రోడ్లను నిరంతరం సంరక్షిస్తూ... ప్రమాణాల ప్రకారం రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నాయి.

ఇదీ చదవండి :రెండునెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టగలం: ఎంఐఎం ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details