Palle Pattana Pragathi Program Begins: రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామాలు, పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐదో విడత, పట్టణ ప్రాంతాల్లో నాలుగో విడత పనులను ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెరుగుదల... పారిశుద్ధ్యం, పచ్చదనం మెరుగుదలే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని సీఐబీ క్వార్టర్స్ వద్ద... ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రగతి కార్యక్రమాన్ని తలసాని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ పట్టణ ప్రగతిపై అవగాహన కల్పించారు. 15 రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మంత్రి కోరారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్‌లో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంత్రి సబితా రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ క్రీడప్రాంగణాన్ని ప్రారంభించి, జడ్పీ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మరో దఫా పల్లె, పట్టణ ప్రగతి పనులకు మంత్రి పువ్వాడ అజయ్ శ్రీకారం చుట్టారు. జీకే బంజార పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. బంధనపల్లి చెరువులో పూడికతీత పనులు పరిశీలించారు. రాయపర్తి మండలం కొత్తూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.