Telangana Govt Approves Compassionate Appointments in TSRTC : పదేళ్లుగా ఆర్టీసీలో కండక్టర్ కారుణ్య నియామకాల(Karunya Niyamakalu) కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. టీఎస్ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్(Conductor Posts) పోస్టులను ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.
బ్రెడ్ విన్నర్( కారుణ్య నియామకాలు), మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వీసులో ఉండగా మరణించిన సంస్థ సిబ్బంది కుటుంబాలకు ఇదొక ఊరట కలిగించనుందని చెప్పారు. ఈ కారుణ్య నియామకాలను హైదరాబాద్(66), సికింద్రాబాద్ (126). రంగారెడ్డి (52), నల్గొండ (56), మహబూబ్‌నగర్ (83), మెదక్ (93), వరంగల్ (99), ఖమ్మం (53), అదిలాబాద్ (71), నిజామాబాద్ (69), కరీంనగర్ (45) రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది.
TSRTC Compassionate Appointments :ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న టీఎస్ఆర్టీసీ(TSRTC) కండక్టర్ నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు న్యాయం జరగనుందని, రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.