రాయలసీమ ఎత్తిపోతల వల్ల కృష్ణా నదికి, శ్రీశైలం దిగువన ఉండే ప్రాజెక్టులకు కలిగే నష్టంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయించాలని, ఈ పథకం చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని, శ్రీశైలం ప్రాజెక్టు ఒట్టిపోకుండా చూడాలని తెలంగాణ విన్నవించింది. తమ వాదన వినకుండా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక చెల్లదని, పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ నివేదించడం సరైనది కాదని చెప్పింది. రాయలసీమ ఎత్తిపోతల శాశ్వతమైనదని, దీనిద్వారా మళ్లించే నీటి సామర్థ్యాన్ని కూడా పెంచారని, అయినా నిపుణుల కమిటీ రెండు ప్రాజెక్టుల విషయంలో కమిటీ భిన్నమైన నివేదికలు ఇచ్చిందని తెలిపింది.
ప్రస్తుతం ఉన్న గ్రావిటీ కాలువ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులైతే, ఎత్తిపోతల సామర్థ్యం 80 వేల క్యూసెక్కులని, ఈ తేడాను నిపుణుల కమిటీ గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. ఈ పథకానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని కమిటీ పేర్కొందని, అంటే ఇది కొత్త పథకం కిందే లెక్కని వివరించింది. రాయలసీమ ప్రాంతానికి బచావత్ ట్రైబ్యునల్ శ్రీశైలం నుంచి నీటినే కేటాయించలేదని, తెలుగుగంగ, గాలేరు-నగరి మిగులు జలాల ఆధారంగా చేపట్టినవేనని తెలంగాణ పేర్కొంది. 880 అడుగులకు పైన నీటిమట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకోవాలని, ఇలా 797 అడుగుల నుంచి తీసుకొనేలా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి వీల్లేదంది.
అదనపు నీటి మళ్లింపు లేదు: ఏపీ
రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కేటాయింపులకు మించి మళ్లించడం కానీ, అదనపు ఆయకట్టు సాగు చేయడం కానీ లేదని, తెలంగాణ ఆరోపణలు అవాస్తవమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ట్రైబ్యునల్ ఎదుట తన వాదనను రాతపూర్వకంగా సమర్పించింది. తాము శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని మళ్లిస్తున్నామని, ఇది పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలపై ప్రభావం పడుతుందన్నది ఊహాజనితమని, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు జాతీయ హరిత ట్రైబ్యునల్ పరిధిలోకే రావని తెలిపింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా తెలంగాణ దాఖలు చేసిన అభ్యంతరాలు.. ఇదే తరహాలో ఉన్నాయని పేర్కొంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పూర్తి వివరాల నివేదికను సమర్పించామని తెలిపింది. కొత్త ప్రాజెక్టు అయితేనే 2006 పర్యావరణ చట్టం పరిధిలోకి వస్తుందని, అయితే వీటి పరిధిలోకి రాయలసీమ ఎత్తిపోతల రాదని వివరించింది. ఈ పథకంవల్ల కొత్త ఆయకట్టు సాగులోకి రాదనడానికి ఉన్న వివరాలను ట్రైబ్యునల్‌కు ఇచ్చామంది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1,2కు ఇచ్చిన ఆయకట్టు వివరాలతో కూడా పోల్చుకొని చూసుకోవచ్చంది. తమకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి వ్యవస్థలో చేసిన మార్పు మాత్రమేనని ఏపీ వెల్లడించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ట్రైబ్యునల్ పరిధిలోకి రాదని, రాయలసీమ ఎత్తిపోతలపై తదుపరి విచారణ లేకుండా నిర్ణయం తీసుకోవాలని కోరింది.
ఇదీ చదవండిఃతాను వాడే మాస్కులపై కేటీఆర్ ట్వీట్