మెట్రో నగరాల్లో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య. కార్యాలయం ఒక చోట ఉంటే... నివాసం పదుల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఉదయం, సాయంత్రం సమయంలో తీవ్రమైన ట్రాఫిక సమస్య ఎదురవుతోంది. ఇక వర్షాలు, వరదలు ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది.
మౌలిక సదుపాయాలతో..
ఔటర్ రింగురోడ్డు పరిసరాల్లో, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీ రూపొందిస్తోంది. దీంతో నివాస ప్రాంతాలు, వ్యాపార వాణిజ్య ప్రాంతాలు, కార్యాలయాలు అన్ని ఒకే దగ్గర అందుబాటులోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, తాగు నీరు, మురుగు నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, విద్యా, వైద్య సదపాయాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక సదుపాయాల రూపకల్పనతో మెరుగైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.
ఆదర్శంగా..
ఎక్కువ ఖాళీ స్థలాలు, వాటిలో పచ్చదనం, తక్కువ ట్రాఫిక్ సమస్యలు ఉండేట్టుగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీ ఉండనుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఇప్పటివరకు కేవలం మహారాష్ట్ర, గుజరాత్‌లోనే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీ ప్రక్రియ అమలులో ఉంది. పట్టణ జనాభాలో ప్రధానంగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కాలం విలువను గుర్తిస్తూ తక్కువ ప్రయాణ సమయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రేడాయ్, ట్రేడాయ్ వంటి సంస్థలతోపాటు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను ప్రోత్సాహించాలని కోరుతున్నాయి. వీటి ద్వారా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలలో మరిన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయంటున్నారు.