తెలంగాణ

telangana

ETV Bharat / state

Letter to KRMB: 'ఆ ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదు' - కేఆర్​ఎంబీకి ఈఎన్సీ లేఖ

telangana government wrote two letters to krmb
telangana government wrote two letters to krmb

By

Published : Oct 26, 2021, 3:35 PM IST

Updated : Oct 26, 2021, 4:18 PM IST

15:33 October 26

Letter to KRMB: 'ఆ ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదు'

 కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్‌ రెండు లేఖలు రాశారు (telangana enc letter to krmb chairmen). ఉమ్మడి రాష్ట్రంలో నందికొండ ప్రాజెక్టు నివేదికలు బేఖాతరు చేస్తూ.. నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఇష్టా రీతిన పెంచుకుంటూ పోయారని మురళీధర్‌ లేఖలో ప్రస్తావించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలోని కట్లెరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారని వివరించారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు లక్షా 3 వేల ఎకరాలు మాత్రమేనని ఈఎన్సీ గుర్తుచేశారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేదికకు భిన్నంగా వ్యవహరించిందన్నారు.  

గత ప్రభుత్వాలు ప్రాజెక్టు రిపోర్టును ఖాతరు చేయలేదు

 ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఏకరాలకు పెంచిందన్నారు. తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు తగ్గించిందని కేఆర్​ఎంబీ ఛైర్మన్‌కు రాసిన లేఖలో ఈఎన్సీ మురళీధర్‌ గుర్తుచేశారు. లక్ష ఎకరాలను లిఫ్ట్ పథకాల ద్వారా సాగులోకి తీసుకు రావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. 53 వేల ఎకరాల ఆయకట్టును చిన్న చెరువుల కింద స్థిరీకంరించాల్సి ఉందని.. ఈ అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పాలేరు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులేటర్ గేట్ కనీస మట్టాన్ని 13 మీటర్లు తగ్గించినందువల్ల తెలంగాణలో చాలా ఆయకట్టును కోల్పోయిందని లేఖలో పేర్కొన్నారు.  

ఆ ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేదు

 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉమ్మడి నివేదికకు అనుగుణంగా ఆంధ్ర ప్రాంతంలో ఆయకట్టును 1.3 లక్షల ఏకరాలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు 1954 ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లేరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని.. జులై 15 గెజిట్ నోటిఫికేషన్‌లో షెడ్యూల్ 2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలని కోరారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు తెలియజేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

మరో లేఖలో ఏమని పేర్కొన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టును వెంటనే ఆపాలని కోరుతూ కేఆర్​ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మరో లేఖ రాశారు. పిన్నపురం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి అనుమతులు పొందలేదన్నారు. పిన్నపురం హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టును వెంటనే ఆపాలని గతంలోనే లేఖలు రాసినా కృష్ణా బోర్డ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్నా బేసిన్‌లో నాలుగు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. కేఆర్​ఎంబీ నుంచి కానీ, ఆపెక్స్ కౌన్సిల్ నుంచి గాని ఎలాంటి అనుమతులు పొందలేదని లేఖలో గుర్తుచేశారు.

అనుమతి లేకుండా విద్యుత్​ ఉత్పత్తి

హైడల్ ప్రాజెక్టులన్నీ కృష్ణా నది నుంచి ఎత్తిపోసిన నీటి ఆధారంగానే ప్రతిపాదించడం జరిగిందన్నారు.కృష్ణా బేసిన్ నుంచి పెన్నార్ బేసిన్‌కి ఎత్తిపోసి అక్కడ జలాశయాల నుంచి ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేవలం 34 టీఎంసీలు మాత్రమే తరలించాలన్నారు. చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు.. శ్రీశైలం కుడికాలువ నుంచి 19 టీఎంసీలు మాత్రమే తరలించాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా దాని కింద బనక చెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోసి ఆయా రిజర్వాయర్ల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని కేఆర్​ఎంబీకి రాసిన లేఖలో ఈఎన్సీ.. ప్రస్తావించారు.

ఆ ప్రాజెక్టులను వెంటనే ఆపించండి

 ఈ చర్యల వల్ల తెలంగాణ బేసిన్‌లోని ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరగనుందని వివరించారు. కేఆర్​ఎంబీ, ఆపెక్స్ కౌన్సిల్ నుంచి  అనుమతులు పొందని చిత్రావతి స్టోరేజ్ హైడల్ ప్రాజెక్ట్‌లను, ఇతర ప్రాజెక్ట్‌లను వెంటనే ఆపి వేయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కేఆర్​ఎంబీకి రాసిన లేఖలో ఈఎన్సీ మురళీధర్​ కోరారు.  

ఇదీ చూడండి:KRMB Subcommittee: శ్రీశైలంలో కృష్ణాబోర్డు ఉపసంఘం సమావేశం.. తేదీలు ఇవే...

Last Updated : Oct 26, 2021, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details