రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆనకట్ట హెడ్ వర్క్స్ ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (Letter to Krmb) పరిధిలోకి తీసుకొని వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ (Letter to Krmb) రాశారు. కేటాయించిన 15.90 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ఆర్డీఎస్ ఆధునీకరణ పనులకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం తెలిపి అవసరమైన మొత్తాన్ని కర్ణాటక ప్రభుత్వానికి జమ కూడా చేశారని అందులో పేర్కొన్నారు.
కాల్వ ఆధునీకరణ పనుల్లో చాలా భాగం పూర్తైందని, శాంతిభద్రతల పేరిట ఆనకట్ట ఆధునీకరణ పనులను మాత్రం ఆంధ్రప్రదేశ్ చేయనీయడం లేదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పనులు చేయవద్దని కర్ణాటకకు ఏపీ అధికారులు లేఖ కూడా రాశారని పేర్కొంది. ఆధునీకరణ పనులు జరగకపోవడంతో గడచిన 25 ఏళ్లుగా 15.90 టీఎంసీలకు గాను కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని తెలిపింది.