Telangana Letter To KRMB: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్న నేపథ్యంలో తమకు కృష్ణా జలాల్లో 45 టీఎంసీలను అదనంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. వివిధ అంశాలపై కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు మూడు లేఖలు రాశారు.
45 టీఎంసీల వినియోగానికి అవకాశం ఇవ్వండి
కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్ తీర్పు, బజాజ్ కమిటీ నివేదిక, 2013లో రాష్ట్ర స్థాయి సాంకేతిక సలహా మండలి సిఫారసులు, ఇతర అంశాల ఆధారంగా సాగర్ ఎగువన 45 టీఎంసీలు అదనంగా వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎస్ఎల్ఎల్బీసీకి 30 టీఎంసీల నికర జలాలు కేటాయించాలన్న సిఫారసులనూ ప్రస్తావించారు.
ఆ వివరాలు ఏపీకి అవసరం లేదు..
అటు నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ప్రతిపాదించిన 13 ఎత్తిపోతల పథకాల విషయంలో ఏపీకి అభ్యంతరాలు అక్కర్లేదని మరో లేఖలో పేర్కొన్నారు. ఆయకట్టుకు నీరందేలా తెలంగాణకు ఉన్న కేటాయింపుల నుంచే ఈ ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నామని, దీని వల్ల నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని చెప్పారు. ఈ 13 ఎత్తిపోతల పథకాల వివరాలు ఏపీకి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణపై ప్రభావం..
అటు రూ. 47 వేల కోట్ల వ్యయంతో కృష్ణాపై ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, విస్తరణ పనుల వల్ల తెలంగాణ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని... ఇదే విషయమై గతంలోనూ ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. బోర్డు ఆమోదం, అత్యున్నత మండలి అనుమతుల్లేకుండా ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించకుండా చూడాలని కోరారు.
సెన్సార్లు పెట్టండి..
చెన్నై నగరానికి తాగునీటి సరఫరా కోసం నిర్వహించిన సమావేశం సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన సెన్సార్ల ఏర్పాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తన అభిప్రాయాలు తెలిపింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీకి లేఖ రాశారు. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్.. ఏటా 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకోవాల్సి ఉందని, అంతకు మించి వినియోగించుకోకుండా చూడాలని లేఖలో తెలంగాణ కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తో పాటు బనకచెర్ల క్రాస్ హెడ్‌రెగ్యులేటర్ అన్ని అవుట్లెట్లు, చెన్నముక్కపల్లి ఆఫ్టేక్, కండలేరుకు సంబంధించిన అన్ని అవుట్లెట్లు, పూండి సరిహద్దు వద్ద సెన్సార్లు ఏర్పాటుచేసి విడుదలయ్యే నీటి వినియోగాన్ని పూర్తిగా లెక్కించాలని కోరింది. కేటాయించిన పూర్తి వాటా వినియోగించుకునేలా రాజోలిబండ మల్లింపు పథకం ఆధునికీకరణ పనులు జరగాలని లేఖలో తెలంగాణ పేర్కొంది.
ఇదీచూడండి:krmb grmb projects disputes : అపెక్స్‌కు ప్రాజెక్టుల పంచాయితీ..!