Pre Budget meet : వార్షిక బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమైన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్... ఆయా రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వివిధ అంశాలకు సంబంధించి అభిప్రాయాలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం... తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. కొవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ తిరిగి గాడిన పడే వరకు రాష్ట్రాల రుణపరిమితి ఐదుశాతానికి పెంపును కొనసాగించాలని... పెట్టుబడి వ్యయం కోసం గత రెండేళ్లుగా అమలు చేసిన ఆర్థికసాయాన్ని మరో ఐదేళ్ల పాటు అమలు చేయాలని కోరింది. వివిధ ఉత్పత్తులపై సెస్‌ల విధింపుతో రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని... సెస్‌లు, సర్‌ఛార్జ్‌లను నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలని సూచించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని... సీఎస్ఎస్ కింద కేంద్రం నుంచి ఇచ్చే మొత్తంతో రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
బకాయిలు ఇప్పించండి..
15వ ఆర్థికసంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన రూ.723 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని కోరిన సర్కార్... బీఆర్జీఎఫ్ కింద రావాల్సిన రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు కేంద్ర ఆర్థికశాఖ వెనకబడిన జిల్లాలుగా గుర్తించిందని... ఆయా జిల్లాల్లో మౌలికవసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని, విభజన చట్టం ప్రకారం పరిశ్రమలకు పన్ను రాయతీలు ఇవ్వాలని కోరింది.