Rythubandhu Funds : యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ సీజన్లో రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రావాల్సిన నిధుల్లో తగ్గుదల, రుణ పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పుల్లో కోత నేపథ్యంలో రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక్కట్లు ఎదురయ్యాయి. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంచనాలకు అనుగుణంగానే ఉంది. సగటున ప్రతి నెలా రూ.10 వేల కోట్ల మార్కును అధిగమిస్తోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగినంతగా రాకపోవడంతో పాటు అప్పుల్లో కోతతో సర్కార్ ప్రణాళికకు ఇబ్బంది ఏర్పడింది.
ఎఫ్ఆర్బీఎంకి లోబడి తీసుకునే రుణాల్లో కేంద్రం రూ.15 వేల కోట్లను కోత విధించింది. ఇతర రూపాల్లోనూ రావాల్సిన నిధుల్లోనూ కోత ఉందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.40 వేల కోట్ల తగ్గుదల ఉందని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేవలం 15 రోజుల్లో రూ.7,600 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం ఆర్థిక శాఖకు సవాలుగా మారింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, ఆసరా పింఛన్లు, నిర్వహణ వ్యయం ఇతరత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధులను ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలకు వినియోగించుకుంటుంది. కొద్ది కాలంలోనే ఏకంగా రూ.7,600 కోట్లను సర్దుబాటు చేయాల్సి రావడంతో ఆర్థికశాఖ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.