ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మంత్రివర్గం ఇప్పటికే తీర్మానం కూడా చేసింది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. పిటిషన్ను న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చడం వల్ల సర్కార్కు మార్గం సుగమమైంది.
కసరత్తు ప్రారంభం..
5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకోసం గతంలో జాతీయం చేసిన మార్గాలను డీనోటిఫై చేయాల్సి ఉంటుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా మార్గాల ప్రైవేటీకరణ కోసం రవాణా శాఖ విధివిధానాలు తయారు చేయాలి. ఆ తర్వాత మార్గాలను డీనోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దానిపై అభ్యంతరాలు, సలహాలకు నెల రోజల పాటు గడువుంటుంది. వాటిని పరిష్కరించాక ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తుది నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాతే ప్రైవేట్ బస్సులకు అనుమతులు సాధ్యమవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత ప్రక్రియ ప్రారంభిస్తారు.
కార్మికుల పరిస్థితి..?
ఏకంగా 5,100 ప్రైవేట్ బస్సులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్నది ఇపుడు సమస్య. సంస్థలో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గాక ఇపుడున్న అందరి ఉద్యోగుల సేవలు ఆర్టీసీకి అవసరం ఉండబోవు. సంస్థలో ప్రస్తుతం 49 వేల మంది ఉద్యోగులు ఉండగా... ఏటా సుమారు నాలుగు వేల మంది వరకు పదవీ విరమణ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆర్టీసీలో ఎలాంటి కొత్త నియామకాలు లేవు. ఇపుడున్న సిబ్బంది సంఖ్య సగానికి తగ్గాలంటే కనీసం ఐదారేళ్లు పడుతుంది. అప్పటి వరకు వారందరికీ జీతభత్యాలు ఇవ్వడం సంస్థకు ఇబ్బందికరమనే అంటున్నారు. ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.