రాష్ట్రంలో తొలి కరోనా కేసు వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం... ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. యువకునితో పాటు బస్సులో వచ్చిన, 88 మందిని గుర్తించి... ఇప్పటి వరకు 45 మందికి గాంధీ ఆసుపత్రిలో నమూనాలు సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. సదరు యువకుని ఆరోగ్యం కూడా మెరుగైందని మంత్రి ఈటల తెలిపారు.
ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం
కరోనా వైరస్‌ను గుర్తించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలెవరికీ వైరస్ రాలేదని... ఇక్కడున్న వారికి ఎవరికైనా వ్యాధి వస్తే కూడా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గాంధీ ఆస్పత్రితో పాటు ఆర్మీ, ఛాతీ, కింగ్ కోఠి, వికారాబాద్ ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు సిద్ధం చేశామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఐసోలేటెడ్ వార్డులు, చికిత్స ఏర్పాటు చేస్తామని వివరించారు.
మాస్కుల కొరత... కేంద్రానికి వినతి
మాస్కుల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సరఫరా చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు ఈటల తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఈటల... ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. 104 హెల్ప్ లైన్ పూర్తి స్థాయిలో పని చేస్తుందని, తొమ్మిది శాఖల్లో నోడల్ అధికారులను నియమించి సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.