Telangana Tax Revenue : రాష్ట్ర సర్కార్ 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పన్ను అంచనాలను పూర్తిగా అందుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు ప్రభుత్వం అందించిన వివరాలు ఆదాయ, వ్యయాలను వెల్లడించాయి. 2022-23లో పన్నుల రూపంలో రూ.1,26,606 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే.. రూ.1,26,617 కోట్లు ఖజానాకు సమకూరాయి. అంచనా కంటే రూ.11 కోట్ల పన్నుఆదాయం ఎక్కువగా వచ్చింది.
Telangana Tax Revenue 2022-23 : జీఎస్టీ ద్వారా రూ.41,888 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14,228 కోట్లు.. అమ్మకం పన్ను ద్వారా రూ.29,604 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.18,470 కోట్లు.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.13,994 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల నుంచి మరో రూ.8 430 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర అంచనాలను మించాయి. పన్నేతర ఆదాయం అంచనాల్లో 77 శాతం మేర రూ.19,553 కోట్ల రూపాయలు ఖజానాకు వచ్చాయి.
Telangana Tax Revenue Target Reached : కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు మాత్రం అంచనాలను మూడో వంతు కూడా చేరుకోలేదు. రూ.41,000 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేస్తే.. అందులో కేవలం 32 శాతం రూ.13,179 కోట్లు సమకూరాయి. మొత్తంగా రెవెన్యూ రాబడి అంచనా అయిన రూ.1,93,039 కోట్లలో.. 83 శాతం రూ.1,59,349 కోట్లు ఖజానాకు చేరింది.