రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 273 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. ప్రస్తుతం 17 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లతో పాటు మరో 14 ల్యాబ్‌ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని... రెండు వారాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 33 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు
విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు 94,910 మందికి పరీక్షలు నిర్వహించగా... 681 మందికి పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించింది.