రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్రంలోని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేస్తామని పేర్కొంది. ఈ మేరకు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్య సమాచారం సేకరణ
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో భవిష్యత్తులో అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచార విశ్లేషణ వలన వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్‌ని గుర్తించవచ్చని వెల్లడించారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాలు
ఈ ప్రాజెక్టుకు పైలెట్ కింద రాష్ట్రంలో చిన్న జిల్లాలైన ములుగు, సిరిసిల్లను ఎంచుకున్నామని తెలిపారు. ముందుగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న వైద్యశాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా బిపీ, షుగర్, వివిధ రక్త, మూత్ర పరీక్షల వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరిస్తామని చెప్పారు. ఎవరికైనా అదనపు పరీక్షల అవసరం అయితే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, పరికరాలను అందజేస్తామని చెప్పారు. ఇలాంటి హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.