ఆదాయం కోసం ప్రభుత్వం తర్జన భర్జన కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. వచ్చే నెల 14 వరకు కొనసాగనున్నందున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. జీఎస్టీ, సీఎస్టీ తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సమాయత్తమవుతోంది.
ఆదాయానికి ఆటంకం
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గాలైన జీఎస్టీ, భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు, మద్యంపై వ్యాట్ వంటి ఆదాయమార్గాలకు కరోనా గండికొట్టింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌లు లేకపోవడం వల్ల దానికి సంబంధించిన ఆదాయం కూడా నిలిచిపోయింది. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలపై వచ్చే వ్యాట్ రాబడులు... భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో... రాష్ట్రంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల ద్వారా జీఎస్టీతోపాటు కేంద్ర ప్రవేశ పన్ను, విలువ ఆధారిత పన్నులు మాత్రమే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయి.
ప్రత్యేక దృష్టి సారించిన సీఎస్
సాధారణంగా ప్రతి నెలా జీఎస్టీ, వ్యాట్ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రెండున్నర వేల కోట్లు వరకు ఆదాయం వచ్చేది. కానీ మార్చి నెలలో ఆరున్నర వేల కోట్లు మేర వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సాధారణంగా వచ్చే రాబడులతోపాటు వ్యాట్, సీఎస్టీ పెండింగ్ కేసుల పరిష్కారం, అడ్వాన్స్‌డ్ చెల్లింపుల ద్వారా వసూళ్లు పెంచాలని నిర్ణయించారు. నిత్యం వసూళ్ల స్థితిగతులను టెలికాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్షిస్తున్నారు. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వసూలు చేయాలనుకున్న లక్ష్యాన్ని ఆరున్నర వేల కోట్లు నుంచి అయిదువేల కోట్లకు సవరించారు.
ఒత్తిడికి గురిచేయొద్దు
ప్రస్తుత పరిస్థితిలో వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతపడడం, వ్యాపారాలు సాగకపోవండ వల్ల పన్నుల వసూళ్లు ఆశించిన మేర రావడం లేదు. ఈ నెల 25 వరకు నాలుగువేల కోట్లుకుపైగా రాబడి వచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పన్నుల వసూళ్లు పెంచేందుకు అధికారులు వ్యాపార సంస్థలపై ఒత్తిడి తేవడాన్ని తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోయేషన్ అధ్యక్షుడు నగేశ్ ఖండించారు. కరోనా గండం గడిచిన తరువాత పన్నులు చెల్లించేందుకు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొస్తారని, ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒత్తిడి చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.. డాక్టర్ అయ్యాడు!