తెలంగాణ

telangana

ETV Bharat / state

పొంగులేటికి ప్రభుత్వం ఝలక్.. ఆ వ్యాఖ్యలు చేయడం వల్లేనా? - Ponguleti security removed by TS government

TS Govt shock to Ponguleti :మాజీ ఎంపీ , బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. శ్రీనివాస్‌ రెడ్డికి 3 ప్లస్‌ 3 నుంచి 2 ప్లస్‌ 2కు భద్రత కుదించింది. పొంగులేటికి కేటాయించిన ఎస్కార్ట్‌ వాహనం, సిబ్బంది తొలగించింది. అధికార పార్టీ నాయకుడికి ఒక్కసారిగా భద్రత కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telangana government shock to the EX MP Ponguleti Srinivas Reddy
పొంగులేటికి ప్రభుత్వం ఝలక్.. ఆ కామెంట్స్‌ చేయడం వల్లేనా?

By

Published : Jan 4, 2023, 9:11 PM IST

Updated : Jan 4, 2023, 10:35 PM IST

Ts govt shock to ponguleti : ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. పొంగులేటి భద్రత కోసం కేటాయించిన 3+3 భద్రతను 2+2కు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భద్రతతో పాటు పొంగులేటికి కేటాయించిన ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. ఖమ్మంలోని పొంగులేటి నివాసం వద్ద భద్రత విధులు నిర్వహించే నలుగురు సిబ్బందిని తొలగించింది. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయానికి ఖమ్మం ఏఆర్ పోలీసు అధికారులు సమాచారం చేరవేశారు. కుదించిన భద్రత ప్రకారం వ్యక్తిగత భద్రత కోసం కేటాయించిన సెక్యూరిటీలో ఎవరిని ఉంచాలో తెలపాలని ఏఆర్ పోలీసులు కోరినట్లు తెలిసింది.

TS Govt removed Ponguleti security: అధికార పార్టీ నాయకుడికి ఒక్కసారిగా భద్రత కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో ప్రభుత్వం పొంగులేటికి భద్రత పెంచింది. నిఘావర్గాల నివేదిక ఆధారంగా పొంగులేటికి 3+3 భద్రత కల్పించింది. తాజాగా 2 ఏళ్ల 5 నెలల తర్వాత మళ్లీ భద్రత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే దీనికి కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొందిన తర్వాత.. అధికార పార్టీ గూటికి చేరారు. 2019లో అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ అధినాయకత్వంతో దూరం పెరుగుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే ఈనెల 1న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఖమ్మంలోని తన నివాసంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పొంగులేటి అభిమానాలు,కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీలో తమ నేతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలు కోరారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి 4 ఏళ్లుగా పార్టీలో దక్కుతున్న గౌరవం ఏంటో అందరికీ తెలిసిందేనని అన్నారు. భవిష్యత్తులో దక్కే గౌరవం ఏంటన్న దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా తనతో పాటు ప్రజాప్రతినిధిగా అర్హత ఉన్న ముఖ్య అనుచరులు అందరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరతారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సమయం వచ్చినప్పుడు అభిమానులు, కార్యకర్తలు కోరుకునేది తప్పక చేసి చూపిస్తానని అన్నారు. దీంతో తాజాగా పొంగులేటి చేసిన వ్యాఖ్యల్ని జిల్లా పార్టీకి చెందిన కొంతమంది నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

పొంగులేటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఉభయ జిల్లాల్లో పొంగులేటి తాజా వ్యాఖ్యలు... ప్రభుత్వ భద్రత కుదింపు నిర్ణయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ పరిస్థితి ఎటువంటి రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందన్న చర్చ బీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలపై రాబోయే రోజుల్లో పొంగులేటి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. భద్రత కుదింపు నిజమేనని ఆయన క్యాంపు కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రత కుదిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి

Last Updated : Jan 4, 2023, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details